తెలంగాణలో బీజేపీని ఎలాగైనా లేపాలనుకుంటున్న కేంద్ర నాయకత్వానికి బండి సంజయ్ మొదట ఓ ఆశా కిరణంలా కనిపించాడు. బండి సంజయ్ ఎంపిక కాగానే ఉప ఎన్నికల్లో కలిసి రావటంతో అంతా తన వల్లే అన్నంత బిల్డప్ మొదలయ్యింది. కానీ అసలు విషయం కూడా అక్కడే స్టార్ట్ అయ్యిందని… గెలుపును బలుపుగా భావించటంతో బండి సంజయ్ ఒంటరి పోకడలు పెరిగిపోయాయని, అందుకే పార్టీలో గ్రూపులు మొదలయ్యాయన్న చర్చ పార్టీలో బలంగా ఉంది. నిజానికి ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాల్సిన కాంగ్రెస్ నేతలంతా సైలెంట్ గా ఇంట్లో కూర్చోవటంతో… బండి సంజయ్, బీజేపీలకు ప్రాధాన్యత ఏర్పడిందని, కానీ కాంగ్రెస్ కాస్త హాడావిడి చేస్తే బీజేపీ ఎక్కడా కనిపించదన్న అభిప్రాయం కొంతకాలంగా నిజమవుతోంది.
ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మండే ఎండను సైతం లెక్క చేయకుండా పాదయాత్ర చేస్తుంటే కనీసం మైలెజ్ రావటం లేదు. పాలమూరు పాదయాత్రలో తటస్థంగా ఉన్న పాత టీడీపీ నేతలు బీజేపీ గూటికి చేరుతారని మొదట భావించారు. కానీ అవేవి జరగటం లేదు. ఇలాంటి సందర్భంలో టీఆర్ఎస్ ను కొట్టడం దేవుడెరుగు కనీసం పార్టీని కాంగ్రెస్‌కు పోటీగా అయిన బరిలో ఉంచాలన్న ఉద్దేశంతో రాహుల్ కు పోటీగా నడ్డాను రాష్ట్రానికి రప్పించారు. అయినా ఫలితం లేకుండా పోవటంతో చేసేదేం లేక అమిత్ షా శరణు కోరారు. నిజానికి అమిత్ షా రావటం అంటే పార్టీలో కొత్త ఉత్తేజం రావాలి.
పార్టీకి ఊపు వస్తున్న దశలో అమిత్ షా వంటి లీడర్ వస్తే అది రెట్టింపు అవుతుంది. గతంలోనూ ఇదే జరిగింది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అమిత్ షా సభ టైం వచ్చినా కనీసం చర్చనీయాంశంగా కూడా మారటం లేదు. వాస్తవానికి అమిత్ షా సభ బండి సంజయ్ కు ఎంతో కీలకమైంది. తన చివరి ఆశ కూడా అదే. పార్టీ మళ్లీ రేసులోకి రావాలంటే, బీజేపీకి అనుకూల వాతావరణం ఏర్పాడలంటే, కాంగ్రెస్ మళ్లీ స్టెప్ బ్యాక్ కావాలంటే అమిత్ షాతోనే అని సంజయ్ అనుకున్నారు. కానీ గ్రౌండ్‌లో అలా కనిపించటం లేదు. పాదయాత్ర ముగింపు తర్వాత బండి సంజయ్ కూడా కాస్త సైలెంట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు విశ్లేషకులు.