లతా మంగేష్కర్… పాటల ప్రవాహానికి ప్రతీక. వినసొంపైన వేల అద్భుత పాటలకు కేరాఫ్. మధురమైన కంఠంతో ఏడున్నర దశాబ్దాల పాటు నిర్విరామంగా పాటలను ఆలపిస్తూ రికార్డులు సృష్టించిన అగ్ర గాయని. అత్యద్భుతమైన గానమధుర్యంతో ఆబాలగోపాలన్ని అలరించిన లతా మంగేష్కర్ పుట్టిన రోజు నేడు.
భారతీయ సినిమా పాటల తోటలో లతా మంగేష్కర్ ఓ వటవృక్షం… ఈ చెట్టువీచే పాటలగాలితో ప్రతి భారతీయ హృదయం అనునిత్యం పరవశిస్తూనే ఉంటుంది . ఈ గాన కోకిల 87వ వడిలోకి అడుగుపెట్టారు.
యావద్భారతాన్నీ తన గానామృతంతో పులకింప చేసిన మధురగాయని లతా మంగేష్కర్ సెప్టెంబర్ 28, 1929లో ఇండోర్లో జన్మించారు. 1942లో తన కళాప్రయాణం మహల్ సినిమాలో ‘ఆయెగా ఆయెగా ఆయెగా ఆనేవాలా’ పాటతో ప్రారంభమైంది. దాదాపు 20 భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడారు. ఈమె సోదరి ఆషాభోంస్లే కూడా అక్కకు సరిసాటిగా రాణించారు.
లత 1929 సెప్టెంబర్ 28 తేదీన సుప్రసిద్ధ సంగీతకారుడు దీనానాథ్ మంగేష్కర్ కు పెద్ద కుమార్తెగా (అయిదు గురిలో) జన్మించింది. ఆమె తర్వాత వరుసగా ఆషా, హృదయనాథ్, ఉషా మరియు మీనా అనేవారు కలిగారు. ఆమె బాల్యం కష్టాలు కన్నీళ్ళతో గడిచిపోయింది. అయిదవ ఏటనే తండ్రివద్ద సంగీత శిక్షణ ప్రారంభించిన లతకు సంగీతాన్ని వినడం, పాడడంతప్ప మరోలోకం లేదు. తాను చదువుకోలేకపోయినా తన తర్వాతివారైనా పెద్దచదువులు చదవాలనుకొంది, కానీ వారుకూడా చదువుకన్నా సంగీతంపైనే ఎక్కువ మక్కువ చూపడంతో వారి కుటుంబమంతా సంగీతంలోనే స్థిరపడిపోయింది.
దీనానాథ్ ఆర్ధిక సమస్యలతో ఆరోగ్యం క్షీణించగా 1942లో మరణించాడు. దాంతో పదమూడేళ్ళ వయసుకే కుటుంబ పోషణ బాధ్యత లతపై పడింది. అందువలన సినీరంగంలోకి ప్రవేశించి 1942లో మరాఠీ చిత్రం పహ్లా మంగళ గౌర్ లో కథానాయిక చెల్లెలుగా నటించి రెండు పాటలు పాడింది.
ఆ తర్వాత చిముక్లా సుసార్ (1943), గజెభావు (1944), జీవన్ యాత్ర (1946), మందిర్ (1948 మొదలైన చిత్రాలలో నటించింది. ఆ కాలంలో ఖుర్షీద్, నూర్జహాన్, సురైయాలు గాయనిలుగా వెలుగుతున్నారు. దేశ విభజనకాలంలో ఖుర్షీద్, నూర్జహాన్ లు పాకిస్థాన్ వెళ్లడం, నేపథ్య సంగీత విధానానికి ప్రాధాన్యత పెరగడం వలన ఆమె గాయనిగా ఉన్నత శిఖరాల్ని చేరడానికి దోహదం చేశాయి.
తెలుగులో 1955లోనే ‘నిదురపోరా తమ్ముడా’ అంటూ మన జనాన్ని పరవశింప చేసింది లత గానం… ‘యే మేరే వతన్ కే లోగో…” అంటూ కవి ప్రదీప్ రాసిన గీతం లత గాత్రంలో జాలువారి అమరత్వాన్ని పొందింది… ఆ పాటతో సాక్షాత్తు ఆ నాటి ప్రధానమంత్రి నెహ్రూ సైతం కన్నీరు పెట్టేలా కరుణరసం పలికించారు లత… భారతదేశంలోని పలు భాషల్లో లత గళం పల్లవించింది… ప్రతి చోటా జనాన్ని ఆనందసాగరంలో మునకలేసేలే చేసింది ఈ గానకోకిల…
లతా మంగేష్కర్ గాత్రం ఎన్నో తరాలుగా పరవశింప చేస్తూనే ఉంది… ప్రతి తరం ఆ గానకోకిల గానంతో పరమానందం చెందుతూనే ఉంది… ఎన్నో అవార్డులూ రివార్డులూ లత కీర్తి కిరీటంలో రత్నాలుగా ఒదిగాయి… భారతదేశంలోని అత్యున్నత పురస్కారాలు లతను చేరి మరింత గౌరవాన్ని పొందాయి… లతాకు భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారం ఇచ్చి సత్కరించింది. హిందీ సినీపాటల గాయని అంటే మొదట లతా పేరే గుర్తుకొస్తుంది.
హిందీ పాటలపై, హిందీసినీ జగత్తుపై ఆమె వేసిన ముద్ర అలాంటిది. తెలుగువారిని రెండు సార్లు తన గానమహిమతో పులకింప చేశారు లతా మంగేష్కర్… తొలిసారి సుసర్ల దక్షిణామూర్తి లతలోని గానకోకిలను మనవారి ముందు ప్రత్యక్షమయ్యేలా చేయగా, మూడున్నర దశాబ్దాల తరువాత ఇళయరాజా ఆ మాధుర్యాన్ని మరోమారు మనకు చవి చూపించారు… కొత్తవారికి దారిస్తూ ఈ గానకోకిల ఇటీవలే విరమణ ప్రకటించారు… ఆమె మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగిపోవాలని ఆశిస్తూ గ్రేట్ తెలంగాణ తరుపున లతా మంగేష్కర్‌కు మరో సారి జన్మదిన శుభాకాంక్షలు.