గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నేటితో ముగియనుంది. ప్రతి డివిజన్, కాలనీలు, బస్తీల్లో పండుగ వాతావరణంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా జరిగింది. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 50వేల సభ్యత్వాలు చేయాలనే లక్ష్యంలో భాగంగా స్థానిక నియోజవకవర్గ ఇన్‌చార్జిలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని లక్ష్యాన్ని పూర్తి చేశారు.
సభ్యత్వ నమోదు పూర్తి కావడంతో గ్రేటర్‌లో ఇక కమిటీల సందడి మొదలుకానున్నది. పాత, కొత్త కలయికలతో సామాజిక సమతూకం పాటిస్తూ కమిటీలను ఎంపిక చేయనున్నారు.కమిటీల ఎంపిక ఈనెల 20వ తేదీ నాటికి పూర్తి చేయనున్నారు. ప్రతి కమిటీలోనూ 15మందికి తగ్గకుండా 33మంది ఉండేలా అన్ని సామాజికవర్గాల వారికి ప్రాధాన్యం కల్పించనున్నారు.
డివిజన్, బూత్, బస్తీ కమిటీలకు సంబంధించి యువజన, మహిళా విభాగాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితరులు కలిపి మొత్తం తొమ్మిది అనుబంధ సంఘాలకు కమిటీలు వేయనున్నారు. సభ్యత్వ నమోదులో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ముందంజలో ఉంది. ఈ మేరకు యూసుఫ్‌గూడలోని ఇండోర్ స్టేడియంలో ఈనెల 11వ తేదీ ఆదివారం సభ్యత్వ నమోదు విజయోత్సవ సభ జరగనుంది. ఈ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.