రాజకీయాలు అన్నాకా…విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే…గతంలో రాజకీయ పార్టీల మధ్య సైద్ధాంతికపరమైన విబేధాలు, రాజకీయపరమైన విమర్శలు మాత్రమే ఉండేవి. ఎవరైనా హద్దుమీరి కాస్త రాజకీయ ప్రత్యర్థులను కించపర్చేలా తిట్టినా…ఆ తర్వాత క్షమాపణ చెప్పేవారు. కాని కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలను కాషాయ నేతలు కలుషితం చేస్తున్నారు. రాజకీయపరమైన విమర్శల స్థానే వ్యక్తిగత దూషణలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ఇటీవల సర్జికల్ స్ట్రైక్స్‌పై ఆధారాలు ఏంటని ప్రశ్నించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఏ తండ్రికి పుట్టాడనేది మేం అడిగామా అంటూ అసోం బీజేపీ సీఎం హిమంత బిశ్వశర్మ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ పుట్టుకపై అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేసిన బీజేపీ సీఎం బిశ్వశర్మపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా వారసత్వ రాజకీయాలపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయవేత్త , ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నరేంద్ర మోడీకి పిల్లలు పుట్టాలని కోరుకుంటున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. వారసత్వ రాజకీయాలపై మోడీ స్పందిస్తూ “రామ్మనోహర్ లోహియా కుటుంబం రాజకీయాల్లో ఉందా? ఆయన ఓ సోషలిస్టు. ఫెర్నాండేజ్ కుటుంబం రాజకీయాల్లో ఉందా? ఈయనా ఓ సమాజవాదీ. బీహార్ సీఎం నితీశ్ కుమార్ మాతో కలిసే పనిచేస్తున్నారు. ఆయన కూడా ఓ సోషలిస్టు. వారి కుటుంబం రాజకీయాల్లో ఉందా? ప్రజాస్వామ్యానికి వారసత్వ రాజకీయాలు పెద్ద శత్రువు అంటూ మోదీ విమర్శించారు. కాగా యుపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ సమాజ్‌వాదీ పార్టీకి మద్దతు ఇస్తోంది.
ఈ నేపథ్యంలో వారసత్వ రాజకీయాలపై మోదీ పరోక్షంగా లాలూ ఫ్యామిలీపై విమర్శలు గుప్పించారు. అయితే మోదీ వ్యాఖ్యలపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనదైన శైలిలో వ్యంగాస్త్రాలు సంధింారు. ప్రధాని మోడీకి, బీహార్ సీఎం నితీష్‌కు పిల్లలు కలగాలని తాను దేవుణ్ని ప్రార్థిస్తానని, అంతేకాకుండా వారు కూడా రాజకీయాల్లోకి రావాలని ప్రార్థిస్తానని లాలూ కౌంటర్ ఇచ్చారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, సీఎం నితీశ్‌కు పిల్లలు లేకపోతే తానేం చేయాలని లాలూ వెటకారం ఆడారు.. సీఎం నితీష్‌కు ఓ కుమారుడు ఉన్నాడు. కానీ ఆయన రాజకీయాలకు సరిపడడు. నేనేం చేయగలను? అందుకే వారి పిల్లలు కలగాలని నేను దేవుణ్ని ప్రార్థిస్తాను. వారు రాజకీయాల్లోకి రావాలని కూడా ప్రార్థిస్తానని లాలూ ప్రసాద్ సెటైర్లు వేశారు. మొత్తంగా వారసత్వ రాజకీయాలపై మోదీ చేసిన కామెంట్స్‌కు లాలూప్రసాద్ వేసిన సెటైర్లు దేశ రాజకీయాల్లో సెన్సేషనల్‌గా మారాయి.