దాణా కుంభకోణం కేసులో జార్ఖండ్ రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు.. ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్‌తో పాటు మరో 15 మందిని గత నెల 23న దోషిగా తేల్చిన విషయం తెలిసిందే.అయితే రెండు రోజుల నుంచి తీర్పుపై సందిగ్దం నెలకొనగా ఇవాళ కూడా అదే కంటిన్యూ అయింది. లాలూ శిక్షకు సంబంధించి రేపు మధ్యాహ్నం 2 గంటలకు తీర్పు వెలువడుతుందని న్యాయమూర్తి శివపాల్ సింగ్ తెలిపారు.
పశు దాణా కుంభకోణంలో దోషిగా రుజువైన ఆర్జేడీ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్… కారాగారంలో బాగా చలివేస్తోందని తనదైన చమత్కార శైలిలో గురువారం న్యాయమూర్తికి తెలిపారు. అయితే తబలా వాయించుకోండని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తికి బదులిచ్చారు.
లాలూకు ఎంత శిక్ష విధించేదీ ప్రకటించనుండడంతో న్యాయస్థానం కిక్కిరిసిపోయింది. న్యాయస్థాన గది నుంచి తనను బయటకు తరలించబోతున్న తరుణంలో న్యాయమూర్తిని ఉద్దేశించి లాలూ మాట్లాడుతూ- ప్రశాంతంగా (కూల్ మైండ్‌తో) ఆలోచించండని కోరారు.
లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో చోటుచేసుకున్న పశువుల దాణా కుంభకోణం 1996లో వెలుగులోకి వచ్చింది. 1991-1994 కాలంలో దియోగఢ్(ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉంది) ట్రెజరీ నుంచి దాణా కోసం రూ.89 లక్షలకుపైగా అక్రమంగా డ్రా చేసినట్లు లాలూ , మాజీ సీఎం జగన్నాథ్ సహా 38 మందిపై సీబీఐ 1997, అక్టోబర్ 27న చార్జిషీట్ దాఖలుచేసింది. ఈ కేసు విచారణ జరుగుతున్న కాలంలో 11 మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు.
చియబస ట్రెజరీ నుంచి రూ.37.5 కోట్లు నగదు అక్రమంగా ఉపసంహరించిన కేసులో గతంలో లాలూకు సీబీఐ కోర్టు అయిదేళ్ల జైలు, రూ.25 లక్షల జరిమానా విధించింది. ఈ తీర్పుతో కొన్నాళ్లు జైళ్లో గడిపిన లాలూ 2013లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు.
తర్వాత 2014లో ఈ కేసుపై జార్ఖండ్ హైకోర్టు స్టే విధించింది. ఒక కేసులో అప్పటికే శిక్ష విధించబడిన వ్యక్తిపై అవే ఆధారాలు.. అవే సాక్ష్యులతో విచారించటం సరికాదని కోర్టు తెలిపింది. అయితే సుప్రీంకోర్టు హైకోర్టు స్టే పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
దాణా కుంభకోణంలో వివిధ అభియోగాలు దాఖలు కావడంతో వాటన్నింటిలో లాలూ వివరణ ఇవ్వాల్సిందేనని, లేని పక్షంలో విచారణకు అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉందని సీబీఐ వాదించగా.. సుప్రీంకోర్టు ఆ వాదనతో ఏకీభవించింది. లాలూను ఇతర కేసుల్లో విచారించాలని 2017 మేలో ఆదేశించింది. దీంతో సీబీఐ న్యాయస్థానం ప్రస్తుత కేసు విచారణ ముమ్మరం చేసి, వాదనలు పూర్తిచేయగా డిసెంబర్ 23న లాలూను రాంచీ కోర్టు దోషిగా తేల్చింది.