రివ్యూ : లాల్‌ సింగ్‌ చడ్డా

152
lal
- Advertisement -

బాలీవుడ్‌ స్టార్‌ అమీర్ ఖాన్ హీరోగా కరీనా కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ యువ సామ్రాట్‌ నాగచైతన్య ఒక కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం లాల్ సింగ్ చడ్డా. ఈ సినిమా అమెరికాలో సూపర్ హిట్ గా నిలిచిన ఫారెస్ట్ గంప్ అనే సినిమాకి రీమేక్ కావడం ఆ సినిమాకి అనేక ఆస్కార్ అవార్డులు రావడంతో సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. దానికి తగినట్లుగా సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తుండడం ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడేలా చేసింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు తగినట్లు ఉన్నదా? లేదా? అనేది సినిమా రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
లాల్ సింగ్ చడ్డా(అమీర్ ఖాన్) పంజాబ్ లోని ఒక సిక్ కుటుంబంలో జన్మించిన ఒక బుద్ధిమాంద్యం గల కుర్రాడు. కేవలం బుద్దిమాంద్యం మాత్రమే కాక చిన్నప్పుడే సరిగా నడవలేని పరిస్థితుల్లో తల్లి ప్రోత్సాహంతో స్కూల్ కు వెళ్లి అందరిలా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. అలా స్కూల్ కు వెళ్లిన సమయంలో రూప(కరీనా కపూర్) అనే తన స్నేహితురాలి ప్రోత్సాహంతో ఎలాంటి అవసరం లేకుండా నడిచేలా మారతాడు. ఎదిగినా సరే చిన్నపిల్లడి మనస్తత్వంతోనే ఉండే లాల్ సింగ్ చడ్డా తల్లి కోరిక మేరకు ఆర్మీలో చేరతాడు. అతనికి బాలరాజు అనే ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువకుడితో పరిచయం అవుతుంది. ఆర్మీలో సర్వీస్ అయిన తర్వాత బనియన్లు, చెడ్డీల వ్యాపారం మొదలు పెట్టాలని బాలరాజు లాల్ సింగ్ చడ్డాకి చెబుతాడు. యుద్ధంలో అతను కాపాడిన పాకిస్థాన్ కు చెందన వ్యక్తి జీవితంలో ఏమయ్యాడు? బాలరాజు చెప్పిన బిజినెస్ ప్లాన్ లాల్ సింగ్ చడ్డాకు వర్కౌట్ అయ్యిందా? లాల్ సింగ్ చడ్డా జీవితంలో రూప ఎలాంటి పాత్ర పోషించింది? తల్లి సాయం లేకుండా నడవలేని స్థాయి నుంచి రాష్ట్రపతి అవార్డు అందుకునే స్థాయికి లాల్ సింగ్ చడ్డా ఎలా చేరగలిగాడు అనేదే సినిమా కథ.

విశ్లేషణ:
లాల్ సింగ్ చడ్డా, ఒక బుద్ధి మాంద్యంతో అంగవైకల్యం బారిన పడిన వ్యక్తి, అంగవైకల్యం నుంచి బయటపడినా అసలు ఆ బుద్ధి మాంద్యంతో ఆర్మీలోకి ఎలా వెళ్ళగలిగాడు లాంటి అనేక లాజిక్స్ మీద మాత్రం దృష్టి పెట్టలేదు. సినిమాలో చాలా సన్నివేశాలలో లాజిక్స్ మిస్సయిన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అయితే నాలుగేళ్ల పాటు అలుపెరగకుండా ఒక వ్యక్తి పరిగెట్టడం లాంటి సన్నివేశాలు ప్రేక్షకులకు కన్విన్సింగ్ గా అనిపించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సినిమాగా చూస్తే ఇది ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది అలాగే కొన్నిసార్లు కన్నీళ్లు కూడా తెప్పిస్తుంది. కానీ ప్రేక్షకులను కన్విన్స్ చేసే విధంగా లేకపోవడం అనేది సినిమాకు పెద్ద మైనస్.

అలాగే చాలా చోట్ల లాల్ సింగ్ పాత్రలో అమీర్ ఖాన్ చేసే నటన కొంచెం అతిగా అనిపిస్తుంది.ఇక బాలరాజు పాత్రలో నాగచైతన్య నటన కూడా తెలుగువారికి ఎబెట్టుగా అనిపిస్తుంది. నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ అంటే ఒక రేంజ్ లో ఊహించుకున్న తెలుగు వారికి నాగచైతన్య పాత్ర మాత్రం ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. ఆ పాత్ర నోటి నుంచి ఎక్కువగా చెడ్డీలు బనియన్లు అనే డైలాగులు తప్ప సాధారణ డైలాగులు పలికించడానికి మేకర్స్ ఇష్టపడలేదు ఎందుకో. పాన్ ఇండియా మార్కెట్ కోసమే తెలుగు హీరోను తీసుకున్నారు తప్ప మరేం లేదనిపిస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే
లాల్ సింగ్ చడ్డా సినిమాలో అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా అనే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసినట్లే చెప్పాలి బుద్ధిమాంద్యంతో కూడి అంగవైకల్యంతో పుట్టిన పిల్లాడిగా చిన్ననాటి పాత్ర ఎవరు చేశారో తెలియదు కానీ ఆ చిన్ననాటి పాత్ర చేసిన కుర్రాడు నటన కూడా అద్భుతంగా ఉంది. ఇక ఈ పాత్రకు అమీర్ ఖాన్ తప్ప మరో ఛాయిస్ బాగోదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక రూపా అనే పాత్రలో కరీనా కపూర్ ఒదిగిపోయింది. నాగచైతన్య కాస్త ఇబ్బందికరమైన పాత్ర అయినా ఎక్కడ వెనక్కి తగ్గకుండా నటించాడు. పాత్ర తాలూకు స్వభావాన్ని అర్థం చేసుకొని తనదైన శైలిలో నటించి మెప్పించాడు. ఇక మిగతా పాత్రలలో నటించిన వారు మనకు పెద్దగా పరిచయం లేని వారు కానీ ఎవరి పాత్ర పరిధి మేరకు వారు నటించారు.

టెక్నీకల్ టీమ్ విషయానికి వస్తే
ఇక ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాకి టెక్నీకల్ టీమ్ ప్రాణం. ఈ సినిమాలో సత్యజిత్ పాండే తన కెమెరాతో ఒక మ్యాజిక్ చేశాడు. అలాగే ఈ సినిమా ఎడిటర్ హేమంతి సర్కార్‌ తన కత్తెరకు మరింత పదును పెడితే బాగుండేది. అమితాబ్ భట్టాచార్య సహా ప్రీతమ్ ఈ సినిమాకి సంగీతం అందించడానికి చాలా కష్టపడ్డారు కానీ కొన్ని చోట్ల ఆర్ఆర్ ఆలాగే కొన్ని సాంగ్స్ మాత్రమే బాగున్నాయి. సినిమాలో ప్రధానంగా మైనస్ ఏదైనా ఉందంటే అది సంగీతం మాత్రమే.

ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే
లాల్ సింగ్ చడ్డా సినిమా ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది కానీ తెలుగు వారికి కనెక్ట్ అవడం కష్టం. పాత్రలు తెలుగులో మాట్లాడినంత మాత్రాన తెలుగు వారికి కనెక్ట్ అవ్వడం అనేది కొంచెం కష్టమైన విషయమే.

సినిమా: లాల్ సింగ్ చద్దా
నటీనటులు: అమీర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్, నాగ చైతన్య, మోనా సింగ్, మానవ్ విజ్ తదితరులు.
రచయిత : ఎరిక్ రోత్ మరియు అతుల్ కులకర్ణి
దర్శకుడు: అద్వైత చందన్
నిర్మాణం: వయాకామ్ 18 స్టూడియోస్ మరియు అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్
విడుదల: 11 ఆగస్టు 2022
రేటింగ్ : 2.25 /5

- Advertisement -