పొడుగాటి జడ అంటే చాలు అమ్మాయిలు తెగ మోజుపడిపోతారు. పొడుగు జడ ఉన్నవారిని చూసి మురిసిపోతారు. తమకు అంతపెద్ద జడ ఉంటే బాగుండని కోరుకుంటారు. జడకున్న అందం అలాంటింది. కానీ రష్యాకి చెందిన ఓ క్రీడాకారిణి మాత్రం తనకు జడ ముఖ్యమా..మ్యాచ్ ముఖ్యమా అంటే మ్యాచే ముఖ్యమని అందరు చూస్తుండగా జుట్టు కత్తిరించుకుని అందరు నివ్వేర పోయేలా చేసింది.
వివరాల్లోకి వెళ్తే..సింగపూర్‌లోని ఇండోర్ స్టేడియంలో సోమవారం డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నమెంట్ జరిగింది. ఈ మ్యాచ్‌లో స్వెట్లానా కుజ్నేత్సోవా(రష్యా).. డిఫెండింగ్ ఛాంపియన్ రద్వాంస్కాతో తలపడింది. ఈ మ్యాచ్‌లో మొదటి సెట్‌ను 7-5తో సొంతం చేసుకున్న కుజ్నేత్సోవా.. రెండో సెట్‌ను 1-6తో కోల్పోయింది.
దీంతో టైటిల్ గెలవాలంటే మూడోసెట్ ఇద్దరు క్రీడాకారిణిలకు ముఖ్యమే. దీంతో రష్యాకు చెందిన కుజ్నేత్సోవా తన ఓటమికి కారణం తన జుట్టేనని భావించి మూడో సెట్‌కు ముందు కోర్టులోనే తన జడను కత్తిరించుకుంది. ఎంపైర్‌ను అడిగి కత్తెర తెప్పించుకుని జట్టు చివర్లను కత్తిరించుకుంది. అనంతరం తేరుకుని మ్యాచ్‌ను ఆరంభించింది. వూహించని విధంగా.. మూడో సెట్లో 7-5తో గెలుపు సొంతం చేసుకుని టైటిల్‌ని ఎగరేసుకుపోయింది.
తన జడ తనకు చాలా ఒత్తిడి కలిగించిందని…. హెడ్‌బ్యాండ్ వెనుక పెట్టేందుకు ప్రయత్నించినప్పటికీ.. శిరోజాలు ఒత్తుగా ఉండటంతో అది కుదరలేదని కుజ్నేత్సోవా పేర్కొంది. షాట్ కొడుతున్న ప్రతిసారీ.. జడ ముందుకు పడి తన కళ్లకు తగిలి తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నానని అందుకే కట్ చేసుకున్నానని చెప్పింది. ఏదిఏమైనా జుట్టుపోయినా టైటిల్ మాత్రం మిగిలింది.
Well, @SvetlanaK27 with something you don't see everyday. A self haircut while playing tennis
#WTAFinals pic.twitter.com/j9CwFn7MJ2
— wta (@WTA) October 24, 2016