కుటుంబ బంధాల విలువే రామబాణం: ఖుష్బూ

33
- Advertisement -

‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ సినిమాల తరువాత మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘రామబాణం’. వరుస విజయాలతో దూసుకుపోతున్న అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా భారీస్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన నాయికగా డింపుల్ హయతి నటిస్తుండగా, జగపతి బాబు, ఖుష్బూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచారం చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మే 5న ఈ చిత్రం భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా విలేఖర్లతో ముచ్చటించిన ప్రముఖ నటి ఖుష్బూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

సినిమాలో మీ పాత్ర ప్రాధాన్యత గురుంచి చెప్పండి?
ఈ సినిమా ప్రధానంగా కుటుంబ బంధాల గురించి ఉంటుంది. మనం ఎంత డబ్బు సంపాదించినా, ఉన్నత స్థాయికి చేరినా.. కుటుంబ బంధం అనేది చాలా ముఖ్యం. అలాంటి కథతో ఈ చిత్రం రూపొందింది. అందుకే రామబాణం నాకు అంత దగ్గరైంది. ఇందులో నా పాత్ర మనం మరిచిపోతున్న సంప్రదాయాలు, ఆహార వ్యవహారాలను గుర్తు చేసేలా ఉంటుంది. ప్రస్తుతం మనం తింటున్న ఫాస్ట్ ఫుడ్ వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. సంప్రదాయ ఆహారం విలువని తెలిపేలా నా పాత్ర ఉంటుంది. నా పాత్ర పేరు భువనేశ్వరి. ఆ పాత్రను దర్శకులు మలచిన తీరు చాలా బాగుంది.

తమిళ్ లో వచ్చినంత పేరు తెలుగులో రాకపోవడానికి కారణం?
మొదట్లో తెలుగు సినీ పరిశ్రమ కూడా చెన్నైలోనే ఉండేది. కానీ తెలుగు పరిశ్రమ ఇక్కడికి తరలి వచ్చాక, నేను నా కుటుంబం కోసం అక్కడే ఉండిపోయాను. తమిళ్ లో ఎక్కువ అవకాశాలు వచ్చాయి. డేట్స్ సర్దుబాటు గాక తెలుగులో చంటి వంటి సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది. ఆ విషయంలో ఇప్పటికీ కొంచెం బాధ ఉంది.

గోపీచంద్, జగపతి బాబు తో కలిసి నటించడం ఎలా ఉంది?
గోపీచంద్ తో కలిసి మొదటిసారి నటించాను. సెట్స్ లో గోపీచంద్ చాలా సైలెంట్ గా ఉంటారు. ఆయన పనేదో ఆయన చేసుకొని వెళ్లిపోతుంటారు. కారవాన్ లో కంటే ఎక్కువగా లొకేషన్ లో కుర్చీలో కూర్చోడానికే ఇష్టపడతారు. ఆయన ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటారు. ఇక జగపతిబాబు ఆయన నటుడు కాకముందు నుంచే నాకు తెలుసు. బాల నటిగా వారి బ్యానర్ జగపతి ఆర్ట్స్ లో రెండు సినిమాలు చేశాను. ఆయన మంచి మనసున్న వ్యక్తి. నేను చౌ మామ అని పిలుస్తాను.

ఈ సినిమాలో సందేశం ఉంటుందా?
ఈ సినిమాలో చాలా మంచి సందేశం ఉంటుంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కుటుంబమంతా కలిసి ఉండాలని, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని ఈ సినిమా చెబుతుంది.

ఎలాంటి పాత్రలు, సినిమాలు ఎంచుకుంటున్నారు?
మంచి సినిమాలు చేయాలనే ఆలోచనతో పాత్రలు ఎంచుకుంటున్నాను. గ్లామర్ రోల్స్ చేశాం, డ్యాన్స్ లు చేశాం.. అవన్నీ అయిపోయాయి. ప్రేక్షకులు సినిమా చూసే కోణం కూడా మారింది. ఎలాంటి పాత్రలు చేస్తున్నారని చూస్తున్నారు. ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకునే పాత్రలు పోషించాలి. అలాంటి పాత్రనే రామబాణం లో చేశాను. అజ్ఞాతవాసి లో మంచి పాత్ర పోషించాను. కానీ నన్ను, పవన్ కల్యాణ్ తల్లిలా ప్రేక్షకులు అంగీకరించలేదు అనుకుంటాను. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. వారిసు(వారసుడు)లో 18 నిమిషాల నిడివి గల బలమైన పాత్రను పోషించాను.. కానీ సినిమా నిడివి ఎక్కువ కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నా పాత్రను తొలగించారు. తెలుగులో ఇంకా మంచి మంచి పాత్రలు చేయాలని ఉంది. పాత్రకి ప్రాధాన్యత ఉంటే నిడివి తక్కువ అయినా నటించడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం మనసుకి నచ్చిన పాత్రలను మాత్రమే ఎంచుకుంటున్నాను. అందుకే సినిమాలు తక్కువ చేస్తున్నాను.

సీనియర్ నటిగా హీరోయిన్ డింపుల్ కి ఏమైనా సలహాలు ఇచ్చారా?
అప్పటికి, ఇప్పటికీ మేకింగ్ పరంగా, నటన పరంగా ఎన్నో మార్పులు వచ్చాయి. నేనే ఇంకా ఇప్పటి తరం నుంచి కొన్ని నేర్చుకోవాలి. డింపుల్ మేకప్, హెయిర్ స్టైల్ చేసుకునే విధానం నన్ను ఆకట్టుకుంది. నటనలోనూ అప్పటికి ఇప్పటికీ మార్పు కనిపిస్తుంది. ఇప్పుడు సెటిల్డ్ గా పెర్ఫార్మ్ చేస్తున్నారు. అయితే అప్పుడు మాకు ఏదైనా లొకేషన్ లో సరైన వసతులు లేకపోయినా ఎలా మేకప్ వేసుకోవాలి, ఎలా కాస్ట్యూమ్ మార్చుకోవాలి అనే ట్రిక్స్ తెలుసు. ఈ తరానికి అలాంటివి తెలీదు.

కెరీర్ ప్రారంభంలో మీరు చేసిన సినిమాలు ఇప్పుడు చూసుకుంటే ఏమనిపిస్తుంది?
ఎప్పటికీ గర్వంగానే ఉంటుంది. కాలేజ్ చదువు పూర్తయ్యాక కూడా మనకి స్కూల్ జ్ఞాపకాలు గొప్పగా అనిపిస్తాయి. అది నాకు స్కూల్ లాంటిది. నా నటనకి అదే కదా పునాది. అప్పుడు రాఘవేంద్రరావు, పి వాసు, భారతీరాజా, బాలచందర్ , జంధ్యాల, గోపాల్ రెడ్డి ఇలా ఎందరో గొప్ప దర్శకులతో పని చేశాను. నా పనిని నేను ఆరాధిస్తాను.. అదే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది అనుకుంటున్నాను.

ఫలానా పాత్ర చేయలేకపోయాను అని ఎప్పుడైనా అనుకున్నారా?
అమితాబ్ బచ్చన్ తో కలిసి చీని కం లో టబు నటించింది. ఆ ఛాన్స్ టబు కొట్టేసినందుకు ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను అమితాబ్ కి చాలా పెద్ద ఫ్యాన్ ని. నా బెడ్ రూమ్ లో ఆయన పోస్టర్స్ కూడా ఉంటాయి. అమితాబ్ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను కానీ ఆయనకు జోడీగా చేయలేదనే బాధ ఉంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గురించి చెప్పండి?
ప్రస్తుత కాలంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాంటి గొప్ప నిర్మాణ సంస్థను చూడటం చాలా కష్టం. అందులోనూ వరుసగా విజయాలను అందుకుంటున్నారు.

సంగీతం గురించి?
ఈ సినిమాకి మిక్కీ అద్భుతమైన సంగీతం అందించారు. పాటలకు విశేష స్పందన లభిస్తోంది. ఆయనకు ఆడియన్స్ పల్స్ తెలుసు.

Also read: రికార్డ్స్ కోసం బన్నీ పెయిడ్ ప్రమోషన్స్

దర్శకుడు శ్రీవాస్ గురించి?
నేను శ్రీవాస్ తో మొదటిసారి పని చేస్తున్నట్లు అనిపించలేదు. ఆయన తో పని చేయడం చాలా కంఫర్టబుల్ గా ఉంది.

టీవీ షోలు చేయడం ఎలా ఉంది?
సినిమాలో దర్శకుడు రూపొందించిన పాత్రకి తగ్గట్లుగా నటించాల్సి ఉంటుంది. కానీ టీవీ షోలు అలా కాదు. నేను నాలాగా ఉండొచ్చు.

తెలుగులో ఇంకా ఎవరితో సినిమాలు చేయాలని ఉంది?
ఇప్పటిదాకా బాలకృష్ణతో సినిమా చేయలేదు. ఆయన తో సినిమా చేయాలని ఉంది.

Also read: మంచు వారి పెళ్లి వీడియో..!

- Advertisement -