జేడీఎస్‌ను చీల్చేందుకు 100 కోట్ల ఆఫర్…

230
Kumaraswamy Slams BJP
- Advertisement -

కర్నాటక రాజకీయాలు గంటగంటకు మలుపులు తిరుగుతున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇటు బీజేపీ అటు జేడీఎస్ వేగంగా పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో జేడీఎస్ చీఫ్ కుమారస్వాయి సంచలన ఆరోపణలు చేశారు. జేడీఎస్‌ను చీల్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఇందుకోసం ఏకంగా రూ. 100 కోట్ల ఆఫర్‌తో పాటు తమ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చేందుకు సిద్ధమైందన్నారు.

అంతకముందు జేడీఎస్‌ఎల్పీ నేతగా కుమారస్వామిని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం తన సోదరుడు రేవణ్ణతో కలిసి మీడియాతో మాట్లాడిన కుమారస్వామి తనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు లేకపోయినా నరేంద్రమోడీ కర్ణాటకలో అధికారం చేపాడతాననడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

రాష్ట్రంలో లౌకికవాదం నెలకొనాలనే కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. తనకు అధికార దాహం లేదని.. ముఖ్యమంత్రి కావాలన్న కోరికా లేదని.. కేవలం రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్‌తో పనిచేయాలని నిర్ణయించామన్నారు.

కర్ణాటకలో జేడీఎస్‌ను అంతమొందించాలన్నదే బీజేపీ లక్ష్యమని కుమారస్వామి ఆరోపించారు.ఈ పొత్తు ఎన్నికల ఫలితాల తర్వాత కుదిరిందే తప్ప.. ఎన్నికల ముందు నిర్ణయించింది కాదని స్పష్టం చేశారు. బీజేపీ ఉత్తర భారతంలో అశ్వమేథ యాత్ర మొదలుపెట్టింది. ప్రస్తుతం గుర్రాలు కర్ణాటకలో ఉన్నాయి. ఇక్కడితో బీజేపీ అశ్వమేధ యాత్ర ముగుస్తుంది అని కుమారస్వామి అన్నారు. జేడీఎస్‌లో చీలిక లేదని రేవణ్ణ స్పష్టం చేశారు.

- Advertisement -