డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు లేఖ రాశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిరిసిల్లలోని పవర్ లూమ్ కార్మికులు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. పవర్ లూమ్ కార్మికులపై పడుతున్న రూ.35.48 కోట్ల బ్యాక్ బిల్లింగ్ బకాయిలను మాఫీ చేసి, వారికి రావాల్సిన రూ.101.77 కోట్ల విద్యుత్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలన్నారు.
సిరిసిల్ల ప్రాంతం పవర్ లూమ్ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిందని, ఇక్కడ సుమారు 25 వేల పవర్ లూమ్‌లు నడుస్తున్నాయని లేఖలో కేటీఆర్ వివరించారు. మారిన మార్కెట్ పరిస్థితులతో బతకలేక ఆత్మహత్యలే శరణ్యం అనుకున్న సిరిసిల్ల నేతన్నల తలరాత మార్చేందుకు తమ హయాంలో బతుకమ్మ చీరల పథకం తీసుకొచ్చామన్నారు.
పవర్ లూమ్స్‌కు ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.101.77 కోట్ల సబ్సిడీ విడుదల కాకపోవడంతో, సిరిసిల్ల కో-ఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లయ్ సొసైటీ (CESS) తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని కేటీఆర్ తెలిపారు. టీజీఎన్‌పీడీసీఎల్‌కు చెల్లించాల్సిన విద్యుత్ కొనుగోలు ఖర్చులను కూడా చెల్లించలేకపోతున్నదని వివరించారు. బకాయిలను మాఫీ చేసి, సబ్సిడీలను విడుదల చేసి నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
Also Read:27న నారా రోహిత్..’సుందరకాండ’

