KTR: ఆగస్టు 2 డెడ్ లైన్, ప్రభుత్వానికి హెచ్చరిక చేసిన కేటీఆర్

27
- Advertisement -

ఆగస్ట్ 2 లోపు కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మోటార్లను ఆన్ చేసి నీటిని ఎత్తిపోయకుంటే 50 వేల మంది రైతులతో కలిసి మోటార్లను మేమే ఆన్ చేస్తామని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేసీఆర్ మీద కక్షతో రైతుల నోట్లో మట్టికొట్టే దుర్మార్గపు ఆలోచన చేయవద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకుల బృందం రెండు రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. గురువారం సాయంత్రం కరీంనగర్ లోని ఎల్ఎండీ ప్రాజెక్ట్ ను బీఆర్ఎస్ బృందం పరిశీలించింది. శుక్రవారం ఉదయం కన్నెపల్లి పంప్ హౌస్ తో పాటు మేడిగడ్డ బ్యారేజ్ ను బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. మార్గ మధ్యలో కాళేశ్వరంలోని ముక్తేశ్వర స్వామి దర్శించుకున్నారు. అక్కడే గోదావరి నదికి ప్రత్యేక పూజాలు చేశారు. కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలించిన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాజకీయాల కోసం రైతులను బలి పెట్టవద్దని ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని కోరారు. శ్రీరాం సాగర్, ఎల్ఎండీ, మిడ్ మానేరు, ఎల్లంపల్లి లో నీరు లేని కారణంగా రైతుల పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు గోదావరి ఎగువన నీటి కరువు ఉంటే…మేడిగడ్డ వద్ద మాత్రం పదిలక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతున్నాయన్నారు. ఈ నీటిని సకాలంలో ఎత్తిపోసుకుంటే శ్రీరాంసాగర్, ఎల్ఎండీ, మిడ్ మానేర్, రంగనాయకమ్మ సాగర్, కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ జలాశయాలను నింపుకొని నీటి కొరత లేకుండా చేసుకోవచ్చన్నారు.

కానీ కేసీఆర్ పై కోపం, రాజకీయ కక్ష ల కారణంగానే నీటిని ఈ ప్రభుత్వం ఎత్తిపోయటం లేదని కేటీఆర్ విమర్శించారు. పైన నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి లేదని ఇప్పుడు నీటిని ఎత్తిపోయకుంటే వానాకాలం పంట కూడా ఎండిపోయే పరిస్థితి ఉంటుందన్నారు. గతేడాది తమ ప్రభుత్వం సకాలంలో నీటి ఎత్తిపోసి ఎల్ఎండీ, మిడ్ మానేర్ సహా రంగనాయకమ్మ, మల్లన్న సాగర్ వరకు నీటిని తరలించిందని గుర్తు చేశారు. కానీ ఈ ప్రభుత్వం రైతుల పంటలు ఎండిపోయిన సరే కేసీఆర్ కు పేరు రావద్దన్న దురుద్దేశంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గత డిసెంబర్- జనవరిలో కూడా రైతులకు నీళ్లు ఇవ్వాలని కోరితే రాజకీయ ప్రయోజనం కోసం రైతుల పంటలను ఎండబెట్టారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకే రాజకీయాలు చేద్దామని…ఆ తర్వాత నాలుగున్నరేళ్లు ప్రజల కోసం పనిచేద్దామన్నారు. ఈ అంశాన్ని తాము రాజకీయం చేయాలనుకోవటం లేదని…రైతులకు మేలు చేయాలని మాత్రమే ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. బేషజాలకు పోయి, రైతులకు అన్యాయం చేయవద్దని సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి కేసీఆర్ ను గద్దె దింపేందుకు అన్ని కుట్రలు చేశాయన్నారు. నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) పేరుతో ఒక్కరోజులోనే నివేదిక ఇచ్చి మేడిగడ్డకు ఏదో జరిగిపోయినట్లు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అటు కాంగ్రెస్ కూడా కాళేశ్వరంలో లక్ష కోట్లు గంగపాలు అంటూ తప్పుడు ప్రచారం చేసిందన్నారు. మొత్తానికి మీరు చేసిన కుట్రలతో కేసీఆర్ ను గద్దె దించారని ఇంకా రాజకీయాలెందుకని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పుడు కూడా సుందిళ్ల, అన్నారం లో ఏదో ప్రమాదం అంటూ ఎన్డీఎస్ఏ పేరుతో సాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుందిళ్ల, అన్నారంలో డ్రౌటింగ్ పనులు ఆపరేషన్ అండ్ మెయింటెన్స్ లో భాగమేనని అధికారులు చెప్పారన్నారు. బ్రహ్మండంగా నీటి ఎత్తిపోసుకునేందుకు అవకాశం ఉందని ఒక్క ప్రభుత్వం నిర్ణయం కోసమే ఎదురుచూస్తున్నామని అధికారులు చెబుతున్నారని కేటీఆర్ అన్నారు.

కాళేశ్వరంపై కేసీఆర్ మీద చేసిన తప్పుడు ప్రచారాలు గోదావరి ప్రవాహంలో కొట్టుకుపోయాయని కేటీఆర్ అన్నారు. బంగారు పల్లెంలో పంచభక్ష పరమాన్నాలు వడ్డించి పెట్టినట్లు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ను మీకు సిద్ధం చేసి ఇచ్చారన్నారు. దాన్ని కూడా వాడుకోలేని దౌర్బగ్యపు పరిస్థితి లో ఈ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. తెలంగాణలో కరువు అనే పదమే ఉండకుండా చేసేందుకే కాళేశ్వరం లాంటి ప్రతిష్టాత్మకమైన బహుళార్థక ప్రాజెక్ట్ ను కేసీఆర్ తన సంకల్ప బలంతో పూర్తి చేశారని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు కామధేనువు, కల్పతరువని చెప్పారు. గతంలో కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ను బద్నాం చేశాం. ఇప్పుడు పంప్ లు ఆన్ చేస్తే కేసీఆర్ పై మనం చేసిన ప్రచారం తప్పని తేలుతుందని కాంగ్రెస్ నేతలు తేలు కుట్టిన దొంగల్లా సైలెంట్ అయిపోయారన్నారు. ఐతే మాపై దుష్ప్రచారం చేసిన సరే ఇప్పుడు రైతులకు మేలు చేయండని మాత్రమే మేము కోరుతున్నామన్నారు. ప్రజలు ఇచ్చిన మంచి అవకాశాన్ని వారికి మంచి చేసేందుకు ఉపయోగించాలని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై చర్చ పెట్టాలని ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. అదే విధంగా ఆగస్ట్ 2 తర్వాత కూడా పంప్ లు ఆన్ చేయకపోతే…కాళేశ్వరం ద్వారా ప్రయోజనం పొందుతున్న రైతులందరితో కలిసి వచ్చి మోటార్లను ఆన్ చేస్తామని హెచ్చరించారు.

Also Read:కార్గిల్ విజయ్ దివస్..అమర జవాన్ల యాదిలో

- Advertisement -