ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో అక్రమ కూల్చివేతలతో ఇళ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి భరోసా కల్పించారు. “మీ కోసం అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి కూడా పోరాడతాం” అంటూ బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇదే స్థలంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్లు నిర్మించి గృహప్రవేశాలు జరిపించే బాధ్యత మాదేనని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కేసీఆర్ చెప్పమన్నారని తెలిపారు.
ప్రభుత్వం చేపట్టిన కూల్చివేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్, “ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూలగొట్టడమా?” అని ప్రశ్నించారు. శత్రుదేశంపై దండయాత్రకు వెళ్లినట్లు 4000 మంది పోలీసులతో వచ్చి పేదల ఇళ్లను కూల్చివేయడం దారుణమని విమర్శించారు. ఈ అంశాన్ని శాసనసభ, శాసనమండలిలో లేవనెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలిపారు.
ప్రభుత్వం తప్పు చేయకపోతే ముగ్గురు మంత్రులను వెంటనే ఇక్కడికి పంపాలని డిమాండ్ చేశారు. ఎలాంటి తప్పు జరగకపోతే ఆర్డీవోను ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నించారు. ఒక అధికారిని బలి పశువుగా చేసి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
Also Read:పెద్ది మరోసారి వాయిదా పడ్డట్లేనా?

