కంటి వెలుగు కార్యక్రమం ప్రజావైద్యంలో చారిత్రకమైన ముందడుగు అని, “సర్వేంద్రియానాం నయనం ప్రధానం” అన్న స్ఫూర్తితో రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించాలని సదుద్దేశంతో “కంటి వెలుగు” కార్యక్రమం చేపట్టడం జరిగిందని మంత్రి కెటి రామరావు తెలిపారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కంటి వైద్య శిభిరాలను ఈ రోజు మంత్రి కెటి రామారావు, శేరిలింగంపల్లి, గాంధీతో పాటు చందానగర్ మరియు హఫీజ్పేట్ సెంటర్లను పరిశీలించారు. ప్రతి ఒక్కరికి మంచి చూపు ఉండాలని అందరు ఆరోగ్యవంతంగా ఉండాలని “కంటివెలుగు ” కార్యక్రమాన్ని ముఖ్య మంత్రి ప్రారంభించారని తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా దృష్టికి సంబంధించిన లోపాలను పరీక్షించి సరైన సలహాలు ఇచ్చి అవసరమైతే కంటి అద్దాలు మరియు శస్త్రచికిత్సలు అన్నీ ఉచితంగా ఇస్తున్నామన్నారు. పేద ప్రజలకు కంటిచూపు సమస్య నుంచి ఉపశమనం కలిగించి, వారి దైనందిన జీవితంలో జీవన ప్రమాణాలు అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెరుగుపరచాలని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిష్ణాతులైన వైద్య బృందాలు ప్రజలకు అతి చేరువలో వారికి అనుకూలమైన సమయంలో వివిధ రకాల పరీక్షలు నిర్వహించి తదనుగుణంగా వారికి కావలసిన మందులు, కళ్ళద్దాలు లేదా ఏవైనా శస్త్రచికిత్సలు అవసరమైతే శస్త్ర చికిత్సలు చేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంతోమంది వైద్యులు వైద్య సిబ్బంది సేవాభావంతో కృషిచేస్తున్నారని. ఇందుకు గాను ప్రభుత్వం సరైన మౌళిక వసతులు అన్ని సమకూర్చిందన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజలందరూ సిబ్బందికి మరియు ప్రభుత్వానికి సహకరించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దృష్టి సంబంధిత సమస్యల నుంచి విముక్తి పొందుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరాలకు వచ్చిన వృద్దులు మరియు మహిళలను కంటి వెలుగు కార్యక్రమం కోసం ప్రభత్వం ఏర్పాటు చేసిన వసతుల గురుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ వైద్య శిబిరాలలో వచ్చే వృద్దులకు దగ్గరుండి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఆగస్టు 15 నుండి జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సర్కిల్లో కొనసాగతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 37 రకాలైన ప్రాథమిక మరియు దీర్ఘకాలిక దృష్టి లోపం సమస్యలకి పరీక్షలు నిర్వహించి శస్త్ర చికిత్సలు కూడా చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం వచ్చే జనవరి 26 వరకు నిర్విరామంగా కొనసాగుతుందని, పని దినాలలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించడానికి ప్రజలకు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమం విజయవంతం చేయటానికి గాను హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఇప్పటికే అనేక అవగాహాన చర్యలు చేపట్టిందని తెలిపారు. 300 మంది కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇచ్చి ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరుగుతున్నదని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు సంబంధించిన అన్ని వివరాలు జిహెచ్ఎంసి వెబ్సైట్లో పొందుపరచబడ్డాయన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని సుమారు కోటిమంది ప్రజలకి ఉచిత పరీక్షలు చేయబడతాయి. ప్రతి పరీక్షా కేంద్రంలో రోజు 300 మందికి పరీక్ష చేయాలని సంకల్పించడం జరిగిందని మంత్రి తెలిపారు.