అతిపెద్ద లాజిస్టిక్‌ పార్కును ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌..

155
ktr
- Advertisement -

దేశ నలుమూలల నుంచి వచ్చే సరుకు రవాణాను సులభతరం చేయడానికి హైదరాబాద్ నగర శివార్లలో లాజిస్టిక్ పార్కులను నిర్మించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. బాటసింగారంలో నిర్మించిన అతిపెద్ద లాజిస్టిక్ పార్కును రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు. ఉపాధి, అభివృద్ధే లక్ష్యంగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాటసింగారంలో దీనిని నిర్మించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంలో నిర్మించిన ఈ లాజిస్టిక్‌ పార్కు వల్ల రాజధానిపై వాహనాల ఒత్తిడిని తగ్గడంతోపాటు, సరుకు రవాణా మరింత సులభతరం కానుంది. 40 ఎకరాల స్థలంలో సుమారు రూ.40 కోట్ల వ్యయంతో అత్యాధునిక వసతులతో ఈ పార్క్‌ను ఏర్పాటు చేశారు.

ఔటర్‌ రింగురోడ్డు చుట్టూ రెండుచోట్ల లాజిస్టిక్‌ పార్కులు ఏర్పాటు చేయాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. ఇందులో భాగంగా మంగల్‌పల్లిలో 22 ఎకరాల్లో సుమారు రూ.25 కోట్లతో నిర్మించిన లాజిస్టిక్‌ పార్కును గతేడాది ప్రారంభించింది. తాజాగా, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై ఔటర్‌ రింగురోడ్డుకు సమీపంలో నిర్మించిన బాటసింగారం లాజిస్టిక్‌ పార్కు సరుకు రవాణారంగంలోనే సరికొత్తగా నిలువనున్నది.

గ్రేడ్‌-ఏ వేర్‌ హౌసింగ్‌ ప్రమాణాలతో అత్యంత అనుకూలమైన వాతావరణం ఉండి, ఎంతో విలువైన సేవలను అందిస్తారు. మినీ గోడౌన్స్‌, వసతి సౌకర్యం, ఆరోగ్య సంరక్షణ వంటివి అందుబాటులో ఉంటాయి. దేశ నలుమూలల నుంచి వచ్చే సరుకు రవాణా సాఫీగా సాగడంతోపాటు, వందలాదిమందికి ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. 24 గంటలపాటు భద్రతతోపాటు, అవసరమైన సేవలను అందించేలా నిర్వహణ వ్యవస్థను ఏర్పాటుచేశారు.

- Advertisement -