తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి జన్మనిచ్చిన పురిటి గడ్డ కరీంనగర్ అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. దీక్షా దివాస్ సందర్భంగా కరీంనగర్ లోని అల్గునూరు లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు కేటీఆర్. కరీంనగర్ లో జరిగిన సింహా గర్జన ద్వారానే కేసీఆర్ దేశానికి పరిచయమ్యారు… ఎక్కడుంది తెలంగాణ అన్నోళ్లకు ఆనాటి లోక్ సభ ఎన్నికల్లో 2 లక్షల మెజార్టీ ఇచ్చి తెలంగాణ వాదం ఎంత బలంగా ఉందో ఇక్కడి ప్రజలు చూపించారు అన్నారు. 2009 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందన్నప్పుడు చాలా మంది అవమానకరంగా మాట్లాడారు. తెలంగాణ వాదం ఇక లేదని అన్నారు. కానీ కేసీఆర్ గారు ఇదే కరీంనగర్ వేదికగా నా శవయాత్రనో.. తెలంగాణ జైత్రయాత్రనో అంటూ గర్జించారు అన్నారు.
అలాంటి కరీంనగర్ గడ్డకు, కరీంనగర్ బిడ్డకు వందనం తెలియజేస్తున్నా… కరీంనగర్ ప్రజల పోరాట స్ఫూర్తి లేకుంటే తెలంగాణ సిద్ధించేదో లేదో తెలియదు అన్నారు. కేసీఆర్ ఆమరణ దీక్షా చేపట్టి 15 ఏళ్లు గడిచిన సందర్భంగా ఇవ్వాళ.. మనం ఎటు పోవాలో తెలుసుకోవాలంటే.. ఎక్కడ ప్రారంభమయ్యామో తెలుసుకోవాలని కేసీఆర్ నిత్యం చెబుతుంటారు…అప్పట్లో 8 ఏళ్లు హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న మన రాష్ట్రాన్ని బలవంతంగా ఆంధ్రాతో కలిపారు… తెలంగాణను ఆంధ్రాతో కలిపినప్పుడు ఒక అమాయక అమ్మాయికి.. హుషారైన అబ్బాయి చేస్తున్న పెళ్లి ఇదని అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు నిజామాబాద్ వేదికగా అన్నారు… ఈ బంధం బాగుంటే సరే.. లేదంటే ఎప్పుడైనా విడిపోవచ్చని చెప్పారు. ఆనాడే ఇష్టంలేని పెళ్లి చేసినట్లు ఆయనే అంగీకరించారు అన్నారు.
ఆనాడు తెలంగాణను ఆంధ్రాతో కలిపి ఈ ప్రాంతానికి అన్యాయం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీయే… 1956 నుంచి 1969 వరకు జరిగిన అన్యాయాలకు రగలిపోయిన తెలంగాణ ప్రజలు 1969లో తొలి దశ ఉద్యమాన్ని ప్రారంభించారు. 1971 వరకు ఈ ఉద్యమం అద్భుతంగా సాగిందన్నారు. తెలంగాణ పౌరుషం చాటుతూ అప్పుడు ప్రజా సమితి పార్టీ 14 పార్లమెంట్ సీట్లలో 11 సీట్లు గెలిచింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఆత్మను ప్రజలు సాక్షాత్కారించారు… ఆనాటి పోరాటంలో 371 మంది అసువులు బాసారు. అయినా సరే తెలంగాణ ఆకాంక్షలను కాంగ్రెస్ పార్టీ బేఖాతరు చేసిందన్నారు. అయినప్పటికీ ప్రొఫెసర్ జయశంకర్ గారు, ఆర్ విద్యాసాగర్ రావు గారు, మేధావులు, కవులు, కళాకారులు ఎప్పటికైనా ఎవరైనా ఉద్యమ నేత రాకపోతారా అని తెలంగాణ వాదాన్ని వ్యాప్తి చేశారు…. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్లుగా కేసీఆర్ గారు అనుకున్నట్లుగా ఉద్యమాన్ని ప్రారంభించారు అన్నారు.
కరీంనగర్ వేదికగా రణగర్జనతో కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆయన ఉద్యమాన్ని ప్రారంభించారు… ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతో కొట్టండంటూ ఎంతో ధైర్యంగా కేసీఆర్ గారు ప్రకటన చేశారు… పదవి త్యాగంతో ఉద్యమాన్ని మొదలు పెట్టి.. ప్రాణాన్ని పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన నేత కేసీఆర్ గారు మాత్రమే అన్నారు.
తెలంగాణలో ఏ వర్గాన్ని అడిగినా రేవంత్ పాలన గురించి అడిగినా బోరున ఏడుస్తున్నారు… గురుకులాలల్లో విద్యార్థులకు కనీసం సరైన భోజనం పెట్టలేక వాళ్లు చనిపోతున్న పరిస్థితి నెలకొందన్నారు. ఈ పాటి పాలనకు విజయోత్సవాలంట. పోలీసులు లేకుండా ప్రజల్లోకి పోతే ఉరికించి కొట్టే పరిస్థితి ఉందన్నారు. ఇప్పుడంటే బీఆర్ఎస్ కు ఎంతోమంది నాయకులు, పెద్ద బలగం ఉంది..కానీ 2001లో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టిన నాడు ఎవరూ లేరు అన్నారు.