కామారెడ్డి అభివృద్ధి ప్రధాత సీఎం కేసీఆర్ అన్నారు మంత్రి కేటీఆర్. కామారెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…కేసీఆర్‌తో పోటీ అంటేనే ప్రతిపక్ష నాయకులు పారిపోతున్నారన్నారు. ఎవరు డబ్బులిచ్చినా తీసుకొని ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలన్నారు. కామారెడ్డి ఉద్యమ గడ్డ అని…ఉద్యమకారులపై తుపాకీ గురిపెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రస్తుతం టికెట్లు అమ్ముకునే దందా నడుస్తోందన్నారు.
కేసీఆర్ పై పోటీ అంటే పోచమ్మ గుడి ముందు పొట్టేలును కట్టినట్లే అన్నారు. సీఎం కేసీఆర్ కామారెడ్డిలో గెలిస్తే దశ తిరిగిపోతుందన్నారు. కామారెడ్డి అభివృద్ధి కోసమే పోటీ చేస్తున్నారని…కామారెడ్డికి కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు కేసీఆర్ అన్నారు. ఈ నెల 9న సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారని…ఆ సభతోనే ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు కావాలన్నారు.
రాహుల్ గాంధీ లీడర్ కాదు రీడర్ అని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో పడరాని పాట్లు పడ్డామని మళ్లీ ఆ తప్పు చేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. కామారెడ్డిలో కేసీఆర్ గెలిస్తే నిధుల వరద పారడం ఖాయమన్నారు. కామారెడ్డికి గోదావరి నీళ్లు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు.ఇతర పార్టీల వాళ్లు ఇచ్చే డబ్బులు తీసుకోండి ఓటు మాత్రం కేసీఆర్‌కే వేయాలన్నారు.బీజేపీ వాళ్లు గుజరాత్ నుండి డబ్బులు తెస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ చెప్పినట్లే ఇది దొరలకు, ప్రజలకు మధ్య జరుగుతున్న పోరు అన్నారు.ఏనాడూ రైతుకు పెట్టుబడి ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్ చేసిందా అని ప్రశ్నించారు. రైతులను బిచ్చగాళ్లు అని అవమానించిన కాంగ్రెస్ నేతల డిపాజిట్లు గల్లంతు చేయాలన్నారు.
Also Read:సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ యాగం