పెళ్లిచూపులు ఫేం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈ నగరానికి ఏమైంది. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకురానుండగా హైదరాబాద్‌లో సోమవారం ఆడియో వేడుక ఘనంగా జరిగింది .ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌తో పాటు రానా,విజయ్ దేవరకొండ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ …ఈ నగరానికి ఏమైంది అనే టైటిల్ చూసి భయమేసిందన్నారు. తెలంగాణ పట్టణాభివృద్ధిశాఖ మంత్రిని. వర్షాకాలం వస్తే చాలు.. ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ పత్రికల్లో పెద్ద పెద్ద హెడ్డింగులు పెడుతుంటారు. అలాంటి కథేమో అనుకున్నా. కానీ కాదని తెలిసిందన్నారు. చేనేత కళాకారులకు మద్దతుగా ప్రతి సోమవారం చేనేత వస్త్రాలే ధరించాలనే ఓ నియమం పెట్టుకున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనే నటీనటులు, సాంకేతిక నిపుణులంతా చేనేత వస్త్రాలే ధరిస్తారని మాట ఇచ్చారు. అందుకే ఇక్కడికి వచ్చా అని తెలిపారు.
పెళ్లిచూపులు సినిమా అంటే చాలా ఇష్టమని తెలిపారు. సినిమా చూసిన తర్వాత చిత్రబృందాన్ని అభినందించకుండా ఉండలేకపోయానని తెలిపారు. తరుణ్ కుటుంబంతో నాకు పరిచయం ఉంది. కానీ ఎప్పుడూ సినిమాకి సంబంధించిన విషయాలు మాట్లాడేవాడు కాదన్నారు. తరుణ్ భాస్కర్ ఇక ముందు కూడా స్టార్లని కాకుండా కథల్ని నమ్మి ఇలాంటి మంచి సినిమాలు తీయాలన్నారు.