నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా రూ. 48.2 కోట్ల వ్యయంతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నెట్‌వర్క్, రోడ్లు, పార్క్, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్… మనం మారుదాం.. మన పట్టణాన్ని మార్చుకుందాం అనే నినాదంతో ప్రజలు తమ పట్టణాలను సుందరంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. దేవరకొండలో ఇంటింటికీ స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
ప్రతి పట్టణంలో పబ్లిక్ టాయిలెట్లను నిర్మించి రాష్ట్రంలో బహిరంగ మలమూత్ర విసర్జన ఉండకుండా చేస్తామన్నారు. అత్యుత్తమ పౌరసేవలే లక్ష్యంగా నూతన మున్సిపల్ చట్టాన్ని రూపొందించినట్లు తెలిపారు. దేవరకొండలో కోతుల, పందుల బెడదను పరిష్కరిస్తామన్నారు. నూతన మున్సిపల్ చట్టం ద్వారా ప్రతి మున్సిపాలిటీలో 10 శాతం నిధులు హరితహారం కోసం ఖర్చు చేసేలా నిబంధనలున్నాయన్నారు.