తెలంగాణలో కాంగ్రెస్ హస్తం విడిచి గులాబి గూటికి చేరుకుంటూనే ఉన్నారు. ఇదివరకే పలువురు ఎమ్మెల్యేలు, ప్రధాన నేతలు, టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే, హుస్నాబాద్ కాంగ్రెస్ నేత ప్రవీణ్ రెడ్డి కూడా టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. టీఆర్‌ఎస్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రవీణ్ రెడ్డిని టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తాము 16 మంది ఎంపీలను గెలిపించుకుంటామంటే ఎన్నోరకాలుగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్, బీజేపీలపై ధ్వజమెత్తారు. ఒకప్పుడు కేసీఆర్ ఇద్దరు ఎంపీలతోనే తెలంగాణను సాధించుకోలేదా అని గుర్తుచేశారు. ఇద్దరు ఎంపీల అండతోనే కేసీఆర్ దేశ రాజకీయ వ్యవస్థను తనకు అనుకూలంగా మార్చుకుని తెలంగాణ సాకారం చేశారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఐదేళ్ల పాలనలో చెప్పుకోవడాని ఏమీలేదని కేటీఆర్ విమర్శించారు. సామాన్యుడికి మేలు చేకూరకపోగా, తానేం చేశాడో కూడా చెప్పుకోలేని స్థితిలో ప్రధాని మోదీ ఉన్నారని పేర్కొన్నారు.