మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే: కేటీఆర్

7
- Advertisement -

మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా), బీఆర్ఎస్ మలేషియా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ‘మాట్‌డేర్’ (MATDARE) కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఆయిల్, అణ్వాయుధాలు ఉన్నవాడు కాదు లీడర్.. ఆలోచన ఉన్నవాడే అసలైన లీడర్ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మలేషియాలో ప్రవాస తెలంగాణ బిడ్డలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ…కొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతున్న జెన్-జీ (Gen Z) యువత శక్తే భారతదేశానికి ముఖ్యంగా తెలంగాణకు కొండంత బలమని కొనియాడారు.

తెలంగాణ అనే పేరు వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.వేల ఏండ్ల కిందట తెలివాహ (గోదావరి) నది నీళ్లతో తడిచిన మాగాణంలో మన కథ మొదలైంది. ఆ నది ఒడ్డున ఉన్న మాగాణమే తెలిగాణగా, ఆ తర్వాత తెలంగాణగా మారింది. గోదావరి, కృష్ణా జీవనదుల మధ్య విలసిల్లిన ప్రాచీన నాగరికతకు మనం వారసులం. పుడితే పాట, చస్తే పాట, పండుగొస్తే పాట.. అదీ తెలంగాణ వైవిధ్యం. ఇంతటి అమోఘమైన సంస్కృతి మరెవరికీ లేదు. నేను తెలంగాణ బిడ్డనని గల్లా ఎగరేసి చెప్పుకుందాం అన్నారు.

తెలంగాణ సాధించిన మైలురాళ్లను వివరిస్తూ కేసీఆర్ నాయకత్వాన్ని కేటీఆర్ ఆకాశానికెత్తారు.దేశంలోనే రైతులకు ఉచితంగా, 24 గంటలపాటు కరెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ…. ప్రతి గడపకు నల్లా కనెక్షన్ ఇచ్చి, ఇంటింటికీ తాగునీరు అందించిన మొట్టమొదటి రాష్ట్రం…నల్గొండ జిల్లాను దశాబ్దాల పాటు పీడించిన ఫ్లోరోసిస్ మహమ్మారిని కేసీఆర్ నాయకత్వం తరిమికొట్టింది అన్నారు. 70 లక్షల మంది రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయం అందించి దేశంలోనే తెలంగాణ రైతులను నెంబర్ వన్ గా నిలబెట్టింది అని తెలిపారు.

తెలంగాణ భవిష్యత్తు రాజకీయాలపై కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని, 2028 ఎన్నికల్లో కేసీఆర్ గారు మళ్లీ ముఖ్యమంత్రి కావడం తథ్యమని ఆయన స్పష్టం చేశారు.ఈ వేడుకల్లో కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, ఎల్. రమణ, మాజీ ఎంపీ లింగయ్య యాదవ్ ,మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, గాదరి కిషోర్ కుమార్, బీఆర్‌ఎస్‌ గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల, నేత గ్యాదరి బాలమల్లు సహా పెద్ద సంఖ్యలో ఎన్నారైలు, బీఆర్ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read:పెద్ది..రెండోరోజు వసూళ్లివే!

- Advertisement -