ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీ కంపెనీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేఎల్‌ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఒక 75 ఏళ్ల వృద్ధురాలిని వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఎక్స్ (మాజీ ట్విటర్) వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. “ఆమె గొంతు నొక్కలేక చివరకు అరెస్టు చేయించారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులను, ప్రభుత్వ సంస్థలను వాడుకుంటూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆరోపించారు. బలహీనులపై అధికార యంత్రాంగాన్ని ప్రయోగించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో నిన్న సుప్రీంకోర్టులో హైదరాబాద్‌కు చెందిన కేఎల్‌ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రాటెక్ సంస్థకు సంబంధించిన కేసులో తనను వేధిస్తున్నారని బెంగాల్‌కు చెందిన వ్యాపారవేత్త సౌరభ్ అగర్వాల్ ఆరోపించారు. తన 75 ఏళ్ల తల్లిని పోలీసులు అరెస్టు చేసి వేధిస్తున్నారని అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ అంశంపై స్పందించిన కేటీఆర్, వృద్ధ మహిళపై పోలీసు చర్యలు అమానుషమని విమర్శించారు.


