మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా గట్టుప్పల్ లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేతన్నల సమస్యల గురించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కసారి కూడా అసెంబ్లీలో మాట్లాడలేదని అన్నారు. 2018లో రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే మునుగోడు ప్రజలను మోసం చేసిండు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి బీజేపీతో అంటకాగిండు. డబ్బులు పంచి ఉప ఎన్నికలో గెలవాలని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నడని మండిపడ్డారు. మునుగోడులో పంచేందుకు గుజరాత్ నుంచి డబ్బులు తెస్తున్నరన్నారు.
మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో ప్రజలు ఆలోచించాలి. గతంలో మునుగోడు ప్రాంతంలో పరిస్థితి ఎంట్ల ఉందో గుర్తు తెచ్చుకోండి. మునుగోడు ప్రాంతంలో ఫ్లోరోసిస్ పాపం గత పాలకులదే. ఉద్యమసమయంలోనే మునుగోడుకు వచ్చి ఫ్లోరోసిస్ బాధితుల బాధలు చూసిన. మునుగోడు నుంచి ఫ్లోరోసిస్‌ను తరిమికొట్టినం. ఫ్లోరోసిస్ మట్టుబెట్టి ఇంటింటికి మంచినీరు ఇస్తున్నాం. కూసుకుంట్లను గెలిపించండి..మునుగోడును బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తమన్నారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ కోవర్ట్ రాజకీయాలు చేస్తున్నారు. మునుగోడు ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలుపలేదు. మళ్లీ ఇవాళ డబ్బులతో గెలిచేందుకు రాజగోపాల్ రెడ్డి యత్నిస్తున్నాడని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రూ.18 వేల కోట్ల రూపాయలకు మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన్రని మండిపడ్డారు. జానారెడ్డి, పాల్వాయి గోవర్దన్ రెడ్డి మునుగోడు తాగునీటి సమస్యను పట్టించుకోలేదు. మునుగోడు ఉప ఎన్నికలో కార్పొరేట్ కమలం గెలవాల్నా.. గరీబోళ్ల గులాబీ గెలవాల్నా ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు.
తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా..? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటివరకు 50 వేల వరకున్న రైతు రుణాలు మాఫీ చేసినం. త్వరలో మిగతా రుణాలు మాఫీ చేస్తం. మోదీ పాలనలో రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. పెట్రోలో, డీజిల్ ధరలు విపరీతంగా పెంచేశారు. రాజగోపాల్ రెడ్డికి ఓటేస్తే సిలిండర్ ధరను రెండు వేలు చేస్తడన్నారు.గట్టుప్పల్ ను కొత్త మండలంగా ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్ షోకు తరలివచ్చారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.