భవిష్యత్ ప్రాంతీయ పార్టీలదే అని స్పష్టం చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ యావత్ దేశానికి తెలంగాణ ఆదర్శంగా మారిందన్నారు. తెలంగాణ ఇవాళ ఏం ఆలోచిస్తుందో రేపు యావత్ భారతదేశం ఆలోచించే పరిస్థితి వచ్చిందన్నారు.
ఇప్పటివరకు బీజేపీ,కాంగ్రెస్ పాలనలో దేశ ప్రజలు హరిగోస పడ్డారని చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు 150 సీట్లు కూడా రావన్నారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట బీజేపీ,కాంగ్రెస్‌ల అడ్రస్ గల్లంతైతుందన్నారు. ఢిల్లీ మెడలు వంచే పరిస్థితితో తెలంగాణ ప్రజలు ఉండాలని పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పునే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను కోరారు కేటీఆర్. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో వరంగల్ గడ్డకు ఎనలేని ఖ్యాతి ఉందన్నారు. వరంగల్ ఎంపీ సీటును 5 లక్షల మెజార్టీతో గెలిపించి 28 రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మోరీలో వేసినట్లే అన్నారు.
స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు అయినా రైతుల గురించి ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. రైతుల గురించి పట్టించుకున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమే అని తెలిపారు. స్వీయ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని ఆచార్య జయశంకర్ చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు ఎప్పటికైనా పరాయి పార్టీలే. అని మండిపడ్డారు.సంక్షేమ రంగానికి సీఎం కేసీఆర్ పాలన ఓ స్వర్ణయుగం అని కేటీఆర్ తెలిపారు.
లోక్ సభ ఎన్నికలు ముగిసిన వెంటనే పంచాయతీ,మున్సిపాలిటీ ఎన్నికలు రాబోతున్నాయని నాయకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరంగల్ పార్లమెంట్ స్ధానంలో టీఆర్ఎస్ 2 లక్షల మెజార్టీతో గెలిపించాలని కోరారు కేటీఆర్.

