బీఆర్ఎస్ కృషితోనే తెలంగాణకు బీవైడీ:కేటీఆర్

15
- Advertisement -

బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలోని తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించిన ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం బీవైడీ … ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి రావడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. భారీ పెట్టుబడితో తమ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు బీవైడీ సంస్థ ముందుకు రావడంపై కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. సుమారు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి తెలంగాణలో పెట్టాలని బి వై డి సంస్థతో 2022-23లో పలుమార్లు చర్చలు జరిపామని తెలిపారు. బి వై డి సంస్థ హైదరాబాద్ లో ఓలెక్ట్రా సంస్థతో కలిసి పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చినప్పటికీ, చైనా దేశపు పెట్టుబడుల పైన కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధాన పరిమితుల వల్ల ఆ నిర్ణయం వాయిదా పడిందని కేటీఆర్ గుర్తు చేశారు. అయితే, ఇటీవల భారత ప్రభుత్వం సరళీకృత విధానాన్ని అనుసరించడం వల్ల ఈ పెట్టుబడి తిరిగి తెలంగాణకు రావడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు బీవైడీ వంటి ఎలక్ట్రిక్ వాహన దిగ్గజ సంస్థ తమ పెట్టుబడిని తెలంగాణలో పెడుతుందంటే, అది తమ హయాంలో రూపొందించిన ఎలక్ట్రిక్ వాహన విధాన ఫలితమేనని కేటీఆర్ అన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఫార్ములా-ఈపై చేస్తున్న విమర్శలను కేటీఆర్ ప్రస్తావించారు. ఫార్ములా-ఈ రేస్‌ను కేవలం రేస్ గానే చూడకూడదని, తెలంగాణ మొబిలిటీ వ్యాలీ కార్యక్రమంలో భాగంగా సమగ్ర ప్రణాళికతో దీనిని నిర్వహించామని అనేక సార్లు చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. దేశ ఎలక్ట్రిక్ వాహన రంగంలో తెలంగాణను కేంద్ర స్థానంగా మార్చాలనే లక్ష్యంతో అనేక అంశాలతో కూడిన పక్కా ప్రణాళిక ప్రకారం పనిచేశామని కేటీఆర్ తెలిపారు. అందులో భాగంగానే వినూత్నమైన ఈవీ పాలసీ, ఈవి సమ్మిట్, తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు, ఫార్ములా ఈ నిర్వహణ వంటి అనేక కార్యక్రమాలను చేపట్టామన్నారు. గతంలో ఈవి విధానాన్ని తీసుకొచ్చి, ఎలక్ట్రిక్ వాహన రంగం మరియు అనుబంధ రంగాలలో పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో ఫార్ములా-ఈని నిర్వహించామని, దాని ఫలితమే ఈ బీవైడీ పెట్టుబడి అని కేటీఆర్ తెలియజేశారు. అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వ ఆలోచనలు మరియు విధానాల ఫలితమే ఈ రోజు బీవైడీ సంస్థ భారీ పెట్టుబడి అని కేటీఆర్ వివరించారు.

గత మూడున్నర సంవత్సరాలుగా బీవైడీ సంస్థ పెట్టుబడి కోసం, దాని తయారీ ప్లాంట్ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కేటీఆర్ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ప్రభుత్వాలు మంచి విధానాలను ప్రవేశపెడితే, నీచమైన రాజకీయాలను అధిగమించి గొప్ప ఫలితాలను ఇస్తాయని… తెలంగాణ ఎలక్ట్రిక్ వాహన పెట్టుబడుల ద్వారా ఈ విషయం మరోసారి రుజువైందని కేటీఆర్ అన్నారు.

Also Read:మద్రాస్ హైకోర్టుకు కునాల్ కామ్రా!

- Advertisement -