KTR:సంక్షేమ పథకాల రద్దుకు కుట్ర

51
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు లబ్ధి కలిగిస్తున్న సంక్షేమ పథకాలను రద్దు చేసేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్‌ రావు. పార్టీ శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు ,పార్టీ ఇన్చార్జిలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు లబ్ధి కలిగించే సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయడం పట్ల పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలు తెలపాలన్నారు. గృహలక్ష్మి, దళిత బంధు, గొర్రెల పంపిణీ వంటి లబ్ధిదారుల తరఫున ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తాం అన్నారు.

దళిత బంధు, గొర్రెల పంపిణీ రద్దు చేయడం అంటే బలహీనవర్గాలకు, దళితులకు తీరని ద్రోహం చేసినట్లేనన్నారు. పట్టణాలకు గత ప్రభుత్వం కేటాయించిన నిధులు, ఆర్ అండ్ బి, పంచాయితీ రాజ్ రోడ్ల వంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా రద్దు చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన అనేక పథకాలను కేవలం రాజకీయ అక్కసుతో రద్దు చేసుకుంటూ వెళుతుందన్నారు.

గత పది సంవత్సరాలలో లక్షలాదిమందికి ఉపయోగపడి, వారి జీవితాల్లో మార్పు తెచ్చిన కార్యక్రమాలను సైతం కేవలం రాజకీయ దురుద్దేశంతో పక్కన పెడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏ పార్టీ ఉన్న, ప్రభుత్వం అనే వ్యవస్థ శాశ్వతం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు గత ప్రభుత్వం అనుమతులు, నిధులు ఇచ్చిన రోడ్లు, భవనాల వంటి ప్రజా ప్రయోజన మౌలిక వసతుల ను సైతం రద్దు చేస్తుందన్నారు. ఇప్పటికే గృహలక్ష్మి కార్యక్రమాన్ని రద్దు చేస్తూ జీవో ఇచ్చింది. అయితే గృహలక్ష్మి కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి అయి అధికారిక పత్రాలు అందుకున్న వారి పరిస్థితి ఏంటో ప్రభుత్వం తెలియజేయాలన్నారు.

ఇప్పటికే లబ్ధిదారులు ప్రభుత్వం అందించిన అధికారిక పత్రాలు ఆధారంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించే ప్రయత్నం చేస్తున్నారని…ప్రజల ప్రయోజనాలకు లబ్ధి కలిగించే ఏ కార్యక్రమాన్ని వ్యతిరేకించినా, రద్దు చేసినా బి ఆర్ ఎస్ పార్టీ ప్రజల తరఫున నిలబడుతుందన్నారు. దీంతోపాటు గొర్రెల పంపిణీ ద్వారా లక్షలాదిమంది యాదవుల కుటుంబాల్లో ఆర్థిక భరోసా కలిగింది. ఇలాంటి కార్యక్రమాన్ని కూడా రద్దు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. బలహీన వర్గాల్లో కీలకమైన యాదవ సామాజిక వర్గానికి ఆర్థిక భరోసా కలిగించే ఈ కార్యక్రమాన్ని తప్పు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాము. ఇప్పటికే ఈ పథకంలో భాగంగా తమ వాటాగా చెల్లించాల్సిన డిడి లు కట్టిన వారికి వెంటనే ప్రభుత్వం గొర్రెలను పంపిణీ చేయాలన్నారు.

దళిత బంధు కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం రద్దు చేయాలని ఆలోచిస్తున్నది. ఎన్నికల్లో దళిత బంధు కార్యక్రమాన్ని మరింతగా విస్తరించి 12 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీకి కట్టుబడి, ఇప్పటికే ఎంపికైన లబ్ధిదారులకు దళిత బంధు ప్రకారం 10 లక్షలైనా ఇవ్వాలి లేదా కాంగ్రెస్ పార్టీ హామీ మేరకు 12 లక్షల రూపాయలైనా వెంటనే అందించాలన్నారు. దళిత బంధుకు ఎంపికైన వారికి వెంటనే నిధులు చెల్లించి వారి యూనిట్లు ప్రారంభం అయ్యేలా చూడాలన్నారు.

ఒకవైపు పేదలకు ఉపయుక్తంగా ఉండే గృహలక్ష్మిని రద్దు చేసిన కాంగ్రెస్ పార్టీ మరోవైపు బడుగు బలహీన వర్గాల తో పాటు దళిత సమాజానికి అండగా నిలబడిన గొర్రెల పంపిణీ, దళిత బందు కార్యక్రమాన్ని రద్దు చేయడం ఆయా సామాజిక వర్గాలకు తీరని అన్యాయం చేసినట్లేనన్నారు.ఇలా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటూ వెళ్లి తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలుపైన కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో లబ్ధిదారులకు అండగా నిలబడేలా నిరసన కార్యక్రమాలను పార్టీ తరఫున చేపడుతామన్నారు. లబ్ధిదారుల కోసం పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్చార్జీలు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కేవలం సంక్షేమ కార్యక్రమాలను మాత్రమే రద్దు చేయడం కాకుండా… గత ప్రభుత్వం పట్టణాలకు, గ్రామాలకు మంజూరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈ ప్రభుత్వం రద్దు చేస్తుందని…మునిసిపాలిటీలకు టి యు ఎఫ్ ఐ డి సి మరియు ఇతర సంస్థల ద్వారా శాఖ ద్వారా అందించిన అభివృద్ధి నిధుల మంజూరిని రద్దు చేస్తుందన్నారు. ఇప్పటికే ఈ నిధుల కు సంబంధించిన టెండరింగ్ ప్రక్రియ ప్రారంభం కూడా అయింది. రోడ్లు, భవనాలు, ఇతర పౌరవసతుల కార్యక్రమాలు ప్రారంభం కావాల్సి ఉన్న నేపథ్యంలో వీటిని రద్దు చేయడం దుర్మార్గం అని…పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి రోడ్ల మంజూరు ని కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసుకుంటూ వెళుతున్న తీరు పైన ప్రజలను మరింత చైతన్యవంతం చేయాలని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు మాజీ ఎమ్మెల్యేలకు సూచించారు కేటీఆర్,హరీష్ రావు.

Also Read:ఈగల్..రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -