దసరా నాటికి అన్ని ఇళ్ల నిర్మాణం పూర్తి: కేటీఆర్‌

187
ktr meeting
- Advertisement -

ఈ సంవత్సరం ఆగస్టు నాటికి హైదరాబాద్ నగరంలో 50 వేల మంది పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కే .తారకరామారావు తెలిపారు. ఈరోజు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి జిహెచ్ఎంసి పరిధిలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం పైన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నగర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సిహెచ్ మల్లారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు జిహెచ్ఎంసి మరియు పురపాలక శాఖ ఉన్నతాధికారులు, గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మక కార్యక్రమంగా చేపట్టిందని, ఈ మేరకు హైదరాబాద్ నగరంలోనే సుమారు లక్ష ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసి పనులు ప్రారంభించినట్లు ఈ సందర్భంగా పురపాలక శాఖ మంత్రి తారక రామారావు తెలిపారు.

ఇప్పటికే ఈ కార్యక్రమం పై నిరంతరం సమీక్షిస్తూ వాటి పురోగతిని పరిశీలిస్తున్నట్లు తెలిపిన మంత్రి కేటీఆర్ రానున్న ఆగస్టు నాటికి 50 వేల ఇళ్లను హైదరాబాద్ నగరంలోని పేద ప్రజలకు అందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో చేపట్టిన సుమారు లక్ష ఇళ్ల నిర్మాణ పురోగతిని మంత్రులు సమీక్షించారు. ప్రస్తుతం లాక్ డౌన్ ఉన్నప్పటికీ నిర్మాణ పనులు నిరంతరం కొనసాగుతున్నట్లు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ వర్కింగ్ ఏజెన్సీలు మంత్రుల దృష్టికి తీసుకు వచ్చాయి. అయితే ప్రస్తుతం స్టీలు, సిమెంటు, ఇసుక వంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని మంత్రుల దృష్టికి వర్కింగ్ ఏజెన్సీలు తీసుకువచ్చాయి. స్టీలు, ఇసుక, సిమెంట్ వంటి అంశాలు ప్రభుత్వం వర్కింగ్ ఏజెన్సీలకు సహాయకారిగా ఉంటుందని ఈ మేరకు ఆయా కంపెనీలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ, గృహ నిర్మాణ శాఖ అధికారులను మంత్రులు ఆదేశించారు.

ktr Review

ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల 80 శాతానికిపైగా నిర్మాణాలు పూర్తయ్యాయని మిగిలిన సైట్లలో నిర్మాణాలను పూర్తి చేసేందుకు ఇతర డిపార్ట్మెంట్ లతో సమన్వయం చేసుకుని ముందుకు పోవాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. నిర్మాణాలు పూర్తి అయిన చోట వెంటనే విద్యుత్ మరియు తాగునీరు వంటి ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాట్లను త్వరిత గతిన పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే ఇళ్ల నిర్మాణం పూర్తయిన సైట్లను వెంటనే జిహెచ్ఎంసి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా మిగిలిన ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో సింహభాగం హైదరాబాద్ నగరంలోని నిర్మిస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు నగరపాలక సంస్థకు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని గృహ నిర్మాణ శాఖ తరఫున అన్నివిధాలుగా అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పేద ప్రజలకు గౌరవ ప్రదమైన గూడు ఉండాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టారని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగస్టు నాటికి గ్రేటర్ హైదరాబాద్లో 50,000 లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

ప్రస్తుతం తన వేగంగా రెండు పడక గదుల ఇల్లు నిర్మాణం కొనసాగుతుందని, దసరా నాటికి మిగిలిన 50 వేల ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తిచేసి గ్రేటర్ హైదరాబాద్‌లో లక్ష ఇళ్ల నిర్మాణ కార్యక్రమం పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి తలసాని తెలిపారు. ఇప్పటిదాకా సుమారు పదివేల మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను హైదరాబాద్ నగరంలో అందించామని రానున్న మరికొద్ది రోజుల్లో ఆయా ప్రాంతాల వారీగా ఇళ్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్ మరియు ఉన్నతాధికారులు హజరయ్యారు.

- Advertisement -