కేసీఆరే సీఎం…దేశానికే దిక్సూచిగా తెలంగాణ:కేటీఆర్

255
ktr press club
- Advertisement -

తెలంగాణ ప్రగతి రథ చక్రాలు ఆగొద్దు అంటే కేసీఆర్ మళ్లీ సీఎం కావాలన్నారు మంత్రి కేటీఆర్. పని చేస్తున్న ప్రభుత్వం,నాయకుడికి ప్రజలు మద్దతు నిలవాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్ నాలుగేండ్ల స్వల్ప కాలంలోనే అనేక సమస్యలకు పరిష్కారం చూపుతూ ముందుకుసాగామన్నారు. ఆదర్శవంతమైన పాలన,రాజకీయ స్థిరత్వం సాధించామన్నారు.

రాష్ట్ర ఖజానాకు ఇసుక ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 2 వేల కోట్లని తెలిపారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ హయాంలో సంవత్సరానికి 4 కోట్లు మాత్రమే వచ్చేదన్నారు. పారిశ్రామికాభివృద్ధి జరుగుతోందన్నారు. జాతీయ సగటు కంటే అన్ని గణాంకాల్లో ముందున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయిన ఇరుగుపోరుగు రాష్ట్రాలతో ఇచ్చిపూచ్చుకునే విధానాన్ని అవలంభించామన్నారు. ఏపీ ప్రభుత్వ అడ్డంకులు సృష్టించిన సంయమనంతో ఉన్నామని చెప్పారు.

అవినీతికి తావులేకుండా పారదర్శకంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నడిపామన్నారు. ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ హరితహారం కార్యక్రమంలో భాగంగా వంద కోట్ల మొక్కలు నాటామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వైభవం తెచ్చామన్నారు. 40 శాతానికి పైగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. కళ్యాణలక్ష్మీతో పేదింటి ఆడబిడ్డలకు అండగా ఉన్నామన్నారు. కంటి వెలుగుతో 80 లక్షల మంది ప్రజలకు సేవలందించామన్నారు. దేశానికే దిక్సూచిగా తెలంగాణ నిలిచిందన్నారు.

శాంతిభద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడలేదన్నారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్‌ ఏర్పాటుచేశామన్నారు. తెలంగాణలో పేకాట,భూదందాలు లేవన్నారు. నాలుగేళ్లలో నాలుగునిమిషాలు కూడా కర్ఫ్యూ లేదన్నారు. క్రైం రేట్ తగ్గిందన్నారు. గతంలో దురగతాలు చేసిన వారిని అదుపుచేశామన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలతో తెలుగుకు వైభవాన్ని తెచ్చామన్నారు. జర్నలిస్టు సంక్షేమంలో దేశంలో తెలంగాణకు మరే రాష్ట్రం సాటిరాదన్నారు.

ఉద్యోగ నియామకాలపై కూడా ప్రత్యేకదృష్టి సారించామన్నారు. తెలంగాణలో ఉన్న ప్రతిశాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసిన నిరుద్యోగ సమస్యను అరికట్టలేమని అందుకే మూడంచెల వ్యూహంతో ముందుకుపోతున్నామని చెప్పారు. ఇప్పటివరకు 87 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశామని 37 వేల మంది ఉద్యోగాల్లో చేరారని తెలిపారు. విమర్శకులు సైతం అబ్బురపడేలా పారదర్శకంగా నియామకాలు జరిగాయన్నారు. ప్రభుత్వ,ప్రైవేట్ రంగంలో ఉద్యోగం దృష్టిసారించడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించి ఉద్యోగాల కల్పనకు కృషి చేశామని వెల్లడించారు. 15 రోజుల్లో పరిశ్రమలకు టీఎస్ ఐపాస్‌తో అనుమతులిచ్చామన్నారు. ఇప్పటివరకు 8 వేల పరిశ్రమలకు అనుమతులివ్వగా 60 శాతానికి పైగా కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించాయన్నారు.

సోలార్ రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని 3300 సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారు. గ్లోబల్ లివబుల్‌ సిటీగా హైదరాబాద్‌ను నిలిపామన్నారు. హైదరాబాద్‌లో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు. హైదరాబాద్ మెట్రోతో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును పెంచామన్నారు. అనుమానాల నీలి నీడల నుంచి ప్రగతి శీల రాష్ట్రంగా,సంక్షేమంలో అగ్రగామిగా తెలంగాణ ఎదిగిందన్నారు.

- Advertisement -