ఇండియా టుడే మీడియా సంస్థలో వీడియో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న దామోదర్ అకాల మరణం పట్ల భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దామోదర్ మరణవార్త తెలిసిన వెంటనే కేటీఆర్ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి దామోదర్ నాకు తెలిసిన మీడియా మిత్రుడని కేటీఆర్ పేర్కొన్నారు.
దామోదర్ అస్వస్థతకు గురైన విషయం తెలియగానే కేటీఆర్ వెంటనే స్పందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని స్వయంగా ఆరా తీసి, తక్షణమే మెరుగైన వైద్య సేవలు ఉండేలా చూడాలని పార్టీ నేతలను కోరారు. కేటీఆర్ సూచనల మేరకు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు.
మధ్యాహ్నం 3 గంటల సమయం వరకు ఆస్పత్రిలోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. దామోదర్‌కు సీపీఆర్(CPR) చేయడం, ఇతర అత్యవసర వైద్య చికిత్సలు అందించడం వంటి అంశాలను దగ్గరుండి ఆసుపత్రి యాజమాన్యంతో సమన్వయం చేశారు. ప్రాణాలు కాపాడేందుకు పార్టీ నేతలు శాయశక్తులా కృషి చేసినప్పటికీ, ఫలితం దక్కలేదని ఆవేదన చెందారు.దామోదర్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన కేటీఆర్, వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ కష్టకాలంలో దామోదర్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Also Read:‘ఓ..! సుకుమారి’..టైటిల్ పోస్టర్

