బండి సంజయ్‌కు కేటీఆర్ బహిరంగలేఖ

23
- Advertisement -

కేంద్రమంత్రి బండి సంజయ్‌కు బహిరంగలేఖ రాశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. ఈసారి కేంద్ర బడ్జెట్‌లో సిరిసిల్లకు మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ను తీసుకురావాలని లేఖలో కోరారు. గత పదేళ్లుగా ప్రతి బడ్జెట్‌లో కేంద్రం తెలంగాణకు మొండిచెయ్యి చూపింద‌ని…. అనేకసార్లు పవర్‌లూమ్ క్లస్టర్ కోసం పది సార్లు కేంద్రానికి లేఖలు, స్వయంగా కలిసి కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈసారి కేంద్ర బడ్జెట్‌లో సిరిసిల్లకు శుభ‌వార్త అందేలా చూడాల‌ని బండి సంజ‌య్‌ను కోరారు.

రెండోసారి మీరు ఎంపీ కావటం, కేంద్రంలో కూడా మంత్రిగా పదవి దక్కటంతో సిరిసిల్ల నేతన్నలకు సేవ చేసేందుకు మీకిది సరైన సమయం అని గుర్తించండి అని తెలిపారు. సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనేక సార్లు కోరినా, ప్రభుత్వం పట్టించుకోవటం లేదని కేటీఅర్ ఆవేద‌న వ్యక్తం చేశారు. చేనేత కార్మికులు కష్టాల్లో ఉన్న ఈ కీలక సమయంలో వారిని ఆదుకునే మంచి అవకాశం ఇప్పుడు కేంద్రం చేతుల్లో ఉందన్నారు.

సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తే ఇక్కడి నేతన్నల కష్టాలు కొంత మేరకు తీరుతాయని, చేతినిండా పని దొరికి మళ్లీ ఆత్మహత్యలు లేని సిరిసిల్లను చూసే అవకాశం ఉంటుందన్నారు. క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన నైపుణ్యం కలిగిన కార్మికులు, వనరులు ఈ ప్రాంతంలో పుష్కలంగా ఉన్నాయని, నేతన్నలు, చేనేతలను ఆదుకోవటానికి గత పదేళ్లుగా కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందకపోవటం దురదృష్టకరం, భాదకరమన్నారు. వనరులు లేని రాష్ట్రాలకు సైతం కేంద్రం అనేకరకాల ప్రాజెక్టులను మళ్లిస్తున్నందున, అన్నీ సానుకూలాంశాలున్న సిరిసిల్లాకు మేలు జరిగే దిశగా బండి సంజయ్ చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి బడ్జెట్‌కు ముందుకు ఈ అంశంలో కేంద్రానికి విజ్జప్తి చేసేవారమన్నారు. ఈ బడ్జెట్ పెట్టే నాటికే ఆర్థిక మంత్రిత్వ శాఖా మంత్రిని కలిసి సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ ప్రాధన్యతను, దాని వల్ల జరిగే లబ్దిని, వారి దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరారు.

Also Read:వైభవంగా కల్యాణ వేంకటేశ్వరస్వామి వైభవోత్సవాలు

- Advertisement -