KTR:’వర్కర్ టు ఓనర్‌’..అమలేది?

6
- Advertisement -

‘వర్కర్ టు ఓనర్’ పథకాన్ని సంక్రాంతి లోపల అమలు చేయాలి అని డిమాండ్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. లేకపోతే సిరిసిల్లలో 10 వేల మందితో మహా ధర్నా చేపడతామని హెచ్చరించారు. సంక్రాంతి లోపలే ఆసాముల లిస్టును ఫైనల్ చేసి, అర్హులైన నేత కార్మికులకు లెటర్లు కేటాయించాలి… సిరిసిల్ల శాసనసభ్యుడిగా బీఆర్ఎస్ తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.’వర్కర్ టు ఓనర్’ అనే విప్లవాత్మక కార్యక్రమాన్ని సంక్రాంతి లోపలే వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లుగా ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేస్తూ, పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. ఇకనైనా ప్రభుత్వం మొద్దునిద్ర నుంచి మేల్కొని, సంక్రాంతి లోపలే ‘వర్కర్ టు ఓనర్’ పథకాన్ని ప్రారంభించాల్సిందే అని స్పష్టం చేశారు.

ఈ పథకం సమర్థవంతంగా అమలవ్వాలంటే, గతంలో రూపొందించిన ప్రణాళికలకు అనుగుణంగా పవర్ లూమ్‌లను సబ్సిడీపై కొనుగోలు చేయడానికి అవసరమైన నిధులను వచ్చే బడ్జెట్‌లో పూర్తిస్థాయిలో కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే సంక్రాంతి లోపలే ఆసాముల లిస్టును ఫైనల్ చేసి, అర్హులైన నేత కార్మికులకు లెటర్లు కేటాయించాలి అని కోరారు.ఒకవేళ సంక్రాంతి లోపల ఈ ప్రక్రియ పూర్తిచేయకపోతే, సంక్రాంతి అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్లలోని నేతన్నలందరినీ, నేత కార్మికులందరినీ సమీకరించి ఆందోళనకు దిగుతామన్నారు.

కేసీఆర్ ఈ బృహత్తర కార్యక్రమాన్ని కెసిఆర్ ప్రారంభించారని, ఆ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నల వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇక్కడే మహా ధర్నా కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. దాదాపు 10,000 మంది నేతన్నలతో సిరిసిల్ల పట్టణం మొత్తం కదిలే స్థాయిలో ఈ ఉద్యమం ఉంటుందని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను, నేతన్నల జీవితాలను కాపాడేందుకు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన దూరదృష్టి, మానవీయత, రాజకీయ సంకల్పం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా ఉన్న 2005లోనే సిరిసిల్ల నేతన్నల దుస్థితిని, వస్త్ర పరిశ్రమలో నెలకొన్న తీవ్ర సంక్షోభాన్ని గుర్తించి స్పందించిన నాయకుడని గుర్తు చేశారు. ఒక్క వారం వ్యవధిలో తొమ్మిది మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలతో చలించిపోయిన కేసీఆర్ గారు, రాష్ట్ర ప్రభుత్వానికి సోయి రావాలనే ఉద్దేశంతో పార్టీ తరఫున 50 లక్షల రూపాయలను సిరిసిల్ల పద్మశాలి సమాజానికి అందజేసి, నేతన్నలను ఆదుకునే ప్రయత్నం చేశారని తెలిపారు.

ఆ రోజే సిరిసిల్లలో కేసీఆర్ “తెలంగాణ వచ్చే వరకు ధైర్యంగా ఉండండి, తెలంగాణ వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని ఆదుకుంటాను, కాపాడుకుంటాను” అని ఇచ్చిన మాటను, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్షరాలా నిలబెట్టుకున్నారని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. వస్త్ర పరిశ్రమను, ముఖ్యంగా సిరిసిల్ల నేత కార్మికులను కంటికి రెప్పలా కాపాడిన నాయకత్వం కేసీఆర్ గారిదేనని కొనియాడింది.సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు 3,400 కోట్ల రూపాయల విలువైన బతుకమ్మ చీరల ఆర్డర్లను అందించి నేతన్నల బతుకులను మార్చడమే కాకుండా, తెలంగాణ ఆడబిడ్డలకు పండుగ కానుకగా చీరలు అందించిన గొప్ప ఆలోచన కూడా కేసీఆర్‌దేనని పేర్కొన్నారు.

సంవత్సరానికి కోటి మంది మహిళలకు బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు అందించిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు.బతుకమ్మ చీరల పథకం వెనుక ఉన్న లోతైన ఆలోచనను వివరిస్తూ, అప్పటివరకు నేత కార్మికులు నెలకు 8 నుంచి 10 వేల రూపాయలే సంపాదిస్తూ జీవన కష్టాలు పడుతున్నారని, వారి కుటుంబాల్లో మహిళలు బీడీలు చుడుతూ తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అందుకే బీడీ కార్మికులకు నెలకు 2,000 రూపాయల పెన్షన్‌ను 4.5 లక్షల మందికి అమలు చేయడమే కాకుండా, నేత కార్మికుల ఆదాయం 15–20 వేల రూపాయలకు పెరగాలనే లక్ష్యంతో బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చారని వివరించారు.

ఈ చర్యలతో సిరిసిల్ల దశ తిరిగిందని, నేతన్నలకు స్థిరమైన ఆదాయం లభించిందని పేర్కొన్నారు.తదుపరి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ఉన్న మూడంచెల వ్యవస్థను అధ్యయనం చేయాలని కేసీఆర్ గారు అధికారులను ఆదేశించారని, కార్మికులు–ఆసాములు–సేట్లు అనే వ్యవస్థలో కార్మికుడు కార్మికుడిగానే మిగిలిపోవాల్సిన పరిస్థితి ఎందుకు ఉండాలని ప్రశ్నిస్తూ, కార్మికుడిని ఆసామిగా మార్చే విప్లవాత్మక ఆలోచనతో ‘వర్కర్ టు ఓనర్’ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ఇది దేశంలోనే కాక, బహుశా ప్రపంచంలోనే ఎక్కడా లేని వినూత్న పథకమని పేర్కొన్నారు.

బీడీలు చుడుతూ ఆరోగ్యాన్ని కోల్పోతున్న మహిళలకు మంచి వాతావరణంలో ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో సిరిసిల్ల పట్టణం పక్కనే 200 ఎకరాల్లో అపెరల్ పార్కును, దానికి అనుసంధానంగా వర్కర్ టు ఓనర్ కార్యక్రమాన్ని 400 కోట్ల రూపాయలతో కేసీఆర్ గారు ప్రారంభించారని వివరించారు. దాదాపు 50 షెడ్ల నిర్మాణాలు రెండేళ్ల కిందటే పూర్తయ్యాయని, పవర్ లూమ్‌లను సబ్సిడీపై అందించి కార్మికులనే యజమానులుగా మార్చాలనే అద్భుత ఆలోచన దీనిలో ఉందని తెలిపారు.అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని బీఆర్ఎస్ తీవ్రంగా విమర్శించింది.

షెడ్లన్నీ నిరుపయోగంగా మారి, పిచ్చి చెట్లు మొలిచి, కనీస నిర్వహణ కూడా లేకుండా అధ్వాన స్థితిలో ఉన్నాయని, కొన్నిచోట్ల వాటిని వడ్ల నిల్వలకు ఉపయోగించడం కాంగ్రెస్ ప్రభుత్వ అవివేకానికి నిదర్శనమని ఆరోపించింది.ఇది 400 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేసే ప్రయత్నమే అని మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ తరపున చేస్తున్న డిమాండ్ ఒక్కటేనని నేతలు స్పష్టం చేశారు. కేసీఆర్ ఆలోచన ప్రకారం నేత కార్మికులు ఆసాములుగా, వర్కర్ ఓనర్లుగా మారాలని, సిరిసిల్ల ఒక తిరుపూర్ మాదిరిగా వేల కోట్ల రూపాయల వస్త్ర ఉత్పత్తి కేంద్రంగా ఎదగాలని బీఆర్ఎస్ ఆకాంక్షగా పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో అపెరల్ పార్కులో గ్రీన్ నీడిల్, టెక్స్‌పోర్ట్ అనే రెండు పరిశ్రమలను తీసుకువచ్చామని, వాటిలో తయారయ్యే ఉత్పత్తులు న్యూయార్క్‌కు ఎగుమతి అవుతున్నాయని, దాదాపు 2,000 మంది మహిళలకు ఉపాధి లభిస్తోందని తెలిపారు.

Also Read:ఇంటి చిట్కాతో దగ్గు, జలుబుకు చెక్!

కనీసం 1,500 మంది నేత కార్మికులను ఆసాములుగా, అపెరల్ పార్కులో 25,000 మంది మహిళలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు రూపకల్పన జరిగిందని గుర్తు చేస్తూ, సంక్రాంతి లోపల చర్యలు తీసుకోకపోతే ఉద్యమం తప్పదని బీఆర్ఎస్ మరోసారి స్పష్టంగా హెచ్చరించింది.

 

- Advertisement -