కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిట్ విచారణ అనేది రేవంత్ రెడ్డి చేతగాని తనానికి నిదర్శనమని, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ విచారణలు తెరపైకి తెస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు కలిపి పార్లమెంట్‌లో ఎనిమిది చొప్పున సీట్లు గెలిపించినా కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు గుండు సున్నా దక్కిందని విమర్శించారు.
భారతదేశ పౌరుడిగా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ విచారణకు హాజరై కావలసిన సమాధానాలు ఇచ్చారని, రెండేళ్లుగా సాగుతున్న విచారణల్లో ఆయన సమాధానాలతో అధికారులకు స్పష్టత వచ్చిందని కేటీఆర్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రజల దృష్టిని మళ్లించేందుకే రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కాకమ్మ కథలు చెప్పినా రేవంత్ రెడ్డి డొల్లతనం తెలంగాణ ప్రజలకు ఇప్పటికే అర్థమైందని అన్నారు.
సిట్ విచారణ ఎవరి ఆధ్వర్యంలో జరుగుతోందో స్పష్టత లేదని, అది కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలోనా లేక బీజేపీ ప్రభావంలోనా అన్న సందేహం కలుగుతోందని వ్యాఖ్యానించారు. నగరం నడిబొడ్డున గన్ కల్చర్ పెరుగుతున్నా పోలీస్ శాఖ చేతులు ముడుచుకుని కూర్చుందా అని ప్రశ్నించారు. మేడారం మహాజాతరలో కనీస వసతులు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, బస్సులు లేక నానా కష్టాలు అనుభవించారని తెలిపారు.
రేవంత్ రెడ్డి టూర్లలో కాలక్షేపం చేస్తూ పాలనను విస్మరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌పై నిందలు వేయడం సూర్యుడిపై ఉమ్ము వేసినట్టేనని వ్యాఖ్యానించారు. అబద్ధపు మాటలతో ప్రజలను మభ్యపెట్టడం మానుకుని, ఫోన్ ట్యాపింగ్ వంటి కేసులతో డ్రామాలు ఆడడం ఆపాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. దళితులు, గిరిజనులు సహా ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, రాబోయే బడ్జెట్‌లో మానిఫెస్టోలో చెప్పిన సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పటికీ నిలబడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
Also Read:Budget 2026: బడ్జెట్ హైలైట్స్

