RRR మార్పుపై కేటీఆర్ ఫైర్

5
- Advertisement -

రీజినల్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను తమ ప్రభుత్వం ఉన్నప్పుడు రూపొందించామని, కానీ దాన్ని పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం తమ సొంత ప్రయోజనాల కోసం మార్చుకుంటోందని కేటీఆర్ ఆరోపించారు. దీంతో వేలాది మంది రైతులు తమ భూములు కోల్పోయే ప్రమాదంలో ఉన్నారని అన్నారు. ఫోర్త్ సిటీ దగ్గర ఉన్న తమ భూముల కోసం అలైన్‌మెంట్ మార్చి, రీజినల్ రింగ్ రోడ్ స్వరూపాన్ని మార్చేశారని, దీని వల్ల అనేక మంది రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు నిధులు లేవంటున్న ప్రభుత్వం, రీజినల్ రింగ్ రోడ్ కోసం మాత్రం తమ భూములకు లాభం చేకూర్చడానికి భూములు తీసుకుంటామని చెబుతోందని విమర్శించారు. రీజినల్ రింగ్ రోడ్డుకి, ఫోర్త్ సిటీకి మధ్యలో వేస్తున్న రోడ్డు కేవలం రేవంత్ రెడ్డి, జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యుల భూముల కోసం వేస్తున్నారని, ఈ రోడ్డు వెంబడి అనేక మందితో భూములు కొనుగోలు చేసి ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నారని అన్నారు.

ఎలాంటి భూసేకరణ అవసరం లేకుండా రూపొందించిన ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌వేని రేవంత్ రెడ్డి రద్దు చేశారని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని భూములన్నింటినీ అమ్ముతున్నారని, ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌వే రద్దుతో ఐటీ పరిశ్రమ విస్తరణకు విఘాతం కలిగిందని చెప్పారు. గతంలోనే ఎక్స్‌ప్రెస్‌వే కోసం భూమిని ఔటర్ రింగ్ రోడ్డు ప్లాన్‌లో ఉంచామని, మెట్రో రైల్ కోసం ఉంచిన భూమిని ప్రస్తుతం వాడుకోవచ్చని చెబుతున్నా, ఈ ప్రభుత్వం మూర్ఖంగా రద్దు చేసిందని అన్నారు. ఒక మంత్రి ‘మా ప్రభుత్వం వచ్చేది లేదు, చచ్చేది లేదు’ అంటుంటే, ఇంకొక మంత్రి ‘రీజినల్ రింగ్ రోడ్ వచ్చేది లేదు, వచ్చేది లేదు’ అంటున్నాడని ఎద్దేవా చేశారు.

‘హైడ్రా’ కాస్త ‘హైడ్రామా’ అయిందని, ‘హైడ్రా’కు పెద్ద వాళ్ళు కనిపించరని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తమ చేతి గుర్తును తీసివేసి బుల్డోజర్ గుర్తును పెట్టుకోవాలని సూచించారు. రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్నింటినీ అమ్మేస్తాడని, గతంలో పీసీసీ పీఠాన్ని కొని, కాంగ్రెస్ తరపున గెలిచిన ఎనిమిది మంది ఎంపీలను బీజేపీకి మేకలు, గొర్రెల మాదిరిగా అమ్మేశాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అని ఎవరూ అనుకోవడం లేదని, ఆయన ముమ్మాటికీ బీజేపీ మనిషే అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మీడియా మేనేజ్‌మెంట్, పీఆర్ మేనేజ్‌మెంట్ మీద నడుస్తోందని, క్షేత్రస్థాయిలో ఏం జరగడం లేదని విమర్శించారు. ఇప్పటిదాకా ఒక్క గొప్ప కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేపట్టలేదని, రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా చేసిన ఏకైక పని ఏదో చెప్పమనండి అని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, వృద్ధులు ఇలా ఏ ఒక్క వర్గం అయినా రేవంత్ రెడ్డితో సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నించారు. నిజంగా పాలన బాగుంటే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ మూడు రంగుల జెండా పాట ఎందుకు వినిపించడం లేదని అన్నారు.

రానున్న సంవత్సర కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, ఉప ఎన్నికలు వరుసగా వస్తాయని, కనీసం కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేనంత బలహీనంగా ఉందని కేటీఆర్ అన్నారు. ప్రజల చైతన్యాన్ని కాంగ్రెస్ పార్టీ తక్కువ అంచనా వేస్తోందని, ప్రజాపాలన అని చెప్పి కోటిన్నర మంది నుంచి దరఖాస్తులు తీసుకొని ఎంతమందికి లబ్ధి జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని కార్పొరేషన్ల పేరుతో వచ్చిన డబ్బులను కాంగ్రెస్ యువ వికాసం పేరుతో మోసం చేసే ప్రయత్నం చేసిందని ఆరోపించారు.

‘రేవంత్ రెడ్డి యువతతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలియదు’ అని కేటీఆర్ హెచ్చరించారు. ఇప్పుడు యువతతో రేవంత్ రెడ్డి పెట్టుకున్నారని, ఆయన పతనం తప్పదని అన్నారు. గ్రూప్-1 పరీక్షలో జరిగిన అవకతవకలను రాష్ట్ర హైకోర్టు గుర్తించిందని, విద్యార్థులకు జరిగిన నష్టాన్ని కూడా గుర్తించిందని తెలిపారు. మూడు కోట్ల రూపాయలకు గ్రూప్-1 ఉద్యోగాలు అమ్ముకున్నారని అభ్యర్థులే చెబుతున్నారని, ఏ మంత్రి డబ్బులు తీసుకున్నారో అభ్యర్థులనే అడగాలని అన్నారు. ఆ మంత్రి పేరును కూడా అభ్యర్థులు చెప్పారని తెలిపారు. ఈ విషయంలో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే హైకోర్టును ఆశ్రయించవచ్చని సూచించారు. కొంతమంది గ్రూప్-1 అభ్యర్థుల కుటుంబాలను తమపై ఎగదోస్తే ప్రభుత్వానికి ఏమొస్తుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 29 తో తీవ్రమైన నష్టం చేసిందని, ఇంత దారుణమైన పరిస్థితి, అవినీతి గ్రూప్-1 పరీక్షల్లో జరుగుతుంటే బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని నిలదీశారు. గతంలో పేపర్ లీక్ అంటూ సీబీఐ విచారణ అంటూ హడావిడి చేసిన బీజేపీ ఇప్పుడు ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. సీబీఐ విషయంలో రాహుల్ గాంధీది ఒక మాట, రేవంత్ రెడ్డిది ఇంకొక మాట అని ఎద్దేవా చేశారు.

హైదరాబాద్ నగరంలో ఇద్దరు ఆడబిడ్డలు హత్యకు గురైతే ప్రభుత్వం నుంచి కనీసం స్పందన లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డల మరణాలు అనుమానాస్పద అత్యాచారాలుగా కనిపిస్తున్నా, ప్రభుత్వం కనీసం మాట్లాడడం లేదని, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆడబిడ్డల ప్రాణాలు అంత చులకన అయిపోయాయని అన్నారు. రాష్ట్ర హోం శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి స్పందించలేదని, హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని విమర్శించారు.

‘బీసీ డిక్లరేషన్‌కి సంబంధించి అప్పుడే ఇన్ని షరతులు పెట్టేది ఉండేనా’ అని కేటీఆర్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నారని ఖరాఖండిగా చెప్పారు. ఇది రేవంత్ రెడ్డి గతంలో రాష్ట్రాలకు రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ఇస్తే ఉరితీయాలని అన్నారని గుర్తుచేశారు.

Also Read:Bumrah:పాయింట్ ఫీల్డర్ అయ్యాడు!

- Advertisement -