మైనార్టీలకు ప్రాతినిధ్యం ఏదీ?: కేటీఆర్

4
- Advertisement -

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఉపవాసం ఉంటున్న ముస్లిం సోదరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన ప్రార్థనల్లో కూడా ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, “మనుషులందరినీ మనుషులుగా, మతాలకతీతంగా చూసిన గొప్ప పాలకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మతాలకతీతంగా అన్ని పండగలకు ప్రభుత్వ కానుకలు అందించింది. గంగా-జమునా తహజీబ్ సంస్కృతిని కొనసాగిస్తూ, సమాజంలో శాంతిని పెంపొందించే సంస్కృతిని నెలకొల్పాము. మైనార్టీ బాలబాలికలకు అత్యుత్తమ విద్య కోసం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశాము. అంతేకాదు, విదేశీ విద్యా అవకాశాలను కల్పించేందుకు మైనార్టీ సోదరులు, సోదరీమణుల కోసం ప్రత్యేక విదేశీ విద్యా పథకాన్ని అమలు చేశాము. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ఉన్నత విద్యకు అవకాశం కల్పించాము. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీ సంక్షేమ కార్యక్రమాలన్నింటికీ మంగళం పాడుతోంది.”

“దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉంటుంది. కానీ, తెలంగాణ చరిత్రలో తొలిసారిగా మైనార్టీలకు ప్రాతినిధ్యం లేని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఇక్కడ ఉంది. ఇది కాంగ్రెస్ తీసుకొచ్చిన కొత్త కల్చర్. కాంగ్రెస్ ప్రభుత్వం తమ మైనార్టీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలన్నింటినీ, పథకాలను వెంటనే అమలు చేయాలి. మైనార్టీ కార్పొరేషన్‌ను బలోపేతం చేస్తామన్న హామీతో పాటు, ముస్లిం సోదరులు, సోదరీమణులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలి. అప్పటిదాకా మైనార్టీ సోదరుల తరఫున రాష్ట్ర ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తీసుకొస్తాం,” అని కేటీఆర్ స్పష్టం చేశారు.

Also Read:బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

“త్వరలోనే మైనార్టీలకు ఇచ్చిన హామీల అమలు కోసం కేసీఆర్ అనుమతి మేరకు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపడతాము. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ డిక్లరేషన్లను వెంటనే అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము,” అని కేటీఆర్ పేర్కొన్నారు.

- Advertisement -