కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపిందనే విమర్శలొస్తున్నాయి. కుంగుబాటుకు గురైన పిల్లర్లు కొట్టుకుపోవాలని చూస్తున్న ప్రభుత్వం కల నెరవేరడం లేదని, దీంతో మరో ప్లాన్ రెడీ చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పిల్లర్ల కుంగుబాటు సాకుతో బరాజ్ పైనుంచి వాహనాల రాకపోకలను నిలిపివేసిన ప్రభుత్వం ఉన్నట్టుండి అక్కడి సెక్యూరిటీని ఎత్తివేసింది. ఫలితంగా బరాజ్ పైనుంచి వాహన రాకపోకలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వాహన రాకపోకలతో కుంగిన పిల్లర్లపై ఒత్తిడి పడి అవి కొట్టుకుపోవాలన్న కుట్ర ఇందులో దాగి ఉన్నదని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం అంబటిపల్లి మీదుగా మేడిగడ్డ బరాజ్‌పై నుంచి మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌కు వాహనాలు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి. డీసీఎంలు, ట్రాక్టర్లు పొద్దంతా భారీ లోడ్లతో పయనిస్తున్నాయి. మొన్నటిదాకా మేడిగడ్డ బరాజ్‌పై రాకపోకలు నిలిచిపోవడంతో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలకు వెళ్లే వాహనాలు కాళేశ్వరం వంతెన మీది నుంచి వెళ్లేవి. మేడిగడ్డ బరాజ్‌కు ఇరువైపులా సెక్యూరిటీని తొలగించి, చెక్‌పోస్ట్ ఎత్తివేయడంతో వాహనదారుల ప్రయాణానికి బ్రేక్‌ల్లేకుండా పోయింది.
మేడిగడ్డ బరాజ్ మీద ఇంతకాలం ఉన్న రక్షణల తొలగింపు, యథేచ్ఛగా రాకపోకల కొనసాగింపు వెనుక కాంగ్రెస్ ముఖ్యుల ద్విముఖ కుట్ర దాగి ఉన్నదని రాజకీయ, సాగునీటి రంగ నిపుణులు అనుమానిస్తున్నారు. మేడిగడ్డ బరాజ్, తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టును నిరర్ధక ప్రాజెక్టుగా చూపి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలన్న కుట్ర ఇందులో దాగి ఉన్నదని చెప్తున్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను ప్రత్యేకించి ఆ రాష్ట్ర రైతులకు గోదావరి నీటిని బహుమానంగా ఇవ్వాలన్నది రెండో ఎత్తుగడలో భాగంగా కనిపిస్తున్నదని కాళేశ్వరం చుట్టూ జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్న నీటిపారుదల, రాజకీయ నిపుణులు చెప్తున్నారు.
Also Read:ఓటీటీలోకి ..’8 వసంతాలు’!

