మీకు సిగ్గు, లజ్జా ఉంటే వెంటనే KLSR కంపెనీకి ఇచ్చిన అన్ని కాంట్రాక్టులను రద్దు చేయాలి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను కూడా తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశించిన విచారణ పూర్తయ్యే వరకు ఈ కంపెనీకి ఒక్క కొత్త వర్క్ కూడా ఇవ్వకుండా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలి అని ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాదు, KLSR ఫ్రాడ్‌పై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు CBI, SFIO లేదా ED ద్వారా స్వతంత్ర విచారణ జరిపించాలి అని అన్నారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే KLSR కంపెనీకి సుమారు రూ.6000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఎలా వచ్చాయి? అని కేటీఆర్ ప్రశ్నించారు. దివాళా తీసి కేసులు నడుస్తున్న, సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేని కంపెనీ బ్యాంక్ నుంచి కేవలం రూ.15 లక్షలు అప్పు తీసుకున్న పరిస్థితిలో ఉండగా, ఇంత భారీ ప్రాజెక్టులు ఎలా కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
2018 సెప్టెంబర్ 27న రేవంత్ రెడ్డి, ఆయన బంధువులు, సన్నిహితులపై ఐటీ రైడ్స్ జరిగిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. సాయి మౌర్య అనే కంపెనీ రేవంత్ రెడ్డి బావమరిదిది అని, పన్నులు సరిగ్గా చెల్లించడం లేదని అప్పుడే బయటపడిందని చెప్పారు. అదే సమయంలో KLSR ఇన్ఫ్రా రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ అనే విషయమూ వెలుగులోకి వచ్చిందన్నారు.
రేవంత్ రెడ్డి సీఎం కావడానికి ముందు వాడిన TS07 FF 0009 అనే కారు KLSR ఇన్ఫ్రా టెక్ కంపెనీ పేరుపై రిజిస్టర్ అయి ఉందని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ డీల్స్ పేరుతో KLSR ఇన్ఫ్రా, భూపాల్ ఇన్ఫ్రా కంపెనీల నుంచి భారీగా డబ్బులు బదిలీ అయ్యాయని కేటీఆర్ తెలిపారు.
Also Read:Takshakudu:తక్షకుడు టీజర్
2023 జూలైలో KLSR, ASMET కంపెనీల మధ్య వివాదం ఏర్పడి, ఇద్దరూ కలిసి NCLATను ఆశ్రయించారని, ప్రస్తుతం ఆ కేసుపై విచారణ జరుగుతోందని చెప్పారు. అయితే KLSRకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలంటూ NCLAT జడ్జి శరత్ కుమార్ గారిపై ఒత్తిడి తెచ్చారని, ఆ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించి, ఒత్తిడి తట్టుకోలేక కేసు నుంచి తప్పుకుంటున్నానని చెప్పారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

