విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తరగతులకు ఆటంకం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చిన టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్, జేఎన్టీయూ వీసీ.స్థానిక ఎమ్మెల్యే, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిరిసిల్లలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తమ హయాంలో ప్రారంభించిన జేఎన్టీయూ సిరిసిల్ల ఇంజనీరింగ్ కాలేజీకి అవసరమైన శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టే దిశగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వేములవాడలోని డిగ్రీ కాలేజీలో కొనసాగుతున్న ప్రస్తుత తాత్కాలిక తరగతి గదులకు తాళం వేయడంతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై పత్రికల్లో వచ్చిన వార్తను ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేటీఆర్ వెంటనే రంగంలోకి దిగారు. జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ కిషన్ కుమార్ రెడ్డితో పాటు, సాంకేతిక విద్యా కమిషనర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చూడాలని, త్వరగా శాశ్వత భవనాలకు అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించాలని సూచించారు. అంతవరకు ప్రస్తుతం నడుస్తున్న తీరుగానే స్థానిక అగ్రహారంలోని డిగ్రీ కాలేజీ అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
వెంటనే కాలేజీతో అవసరమైన ఒప్పందం చేసుకొని పెండింగ్‌లో ఉన్న అద్దె బకాయిలను చెల్లించేలా చూడాలని కోరారు. ఈ అంశంలో సానుకూలంగా స్పందించిన టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్, వెంటనే పెండింగ్ బకాయిలను చెల్లించడంతోపాటు తరగతులకు ఎలాంటి అంతరాయం లేకుండా, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.ప్రభుత్వం 2021లో సిరిసిల్లలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీని మంజూరు చేసింది. దీని కోసం రూ.402 కోట్లు కేటాయించారు. మొదటి విద్యా సంవత్సరంలో 360 మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభించారు. ప్రస్తుతం సుమారు 1032 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 700 మందికి హాస్టల్ వసతి కూడా కల్పించారు. కొత్త భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు డిగ్రీ కాలేజీలో తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే, కాలేజీ కమిషనర్ నుంచి తాత్కాలిక వసతి పొడిగింపు ఉత్తర్వులు రానందున, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ తరగతి గదులకు తాళం వేశారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న అంశాన్ని తెలుసుకున్న కేటీఆర్, సంబంధిత అధికారులతో మాట్లాడారు.
జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ, టీచింగ్ మరియు వసతికి సంబంధించిన ఈ సమస్యను పరిష్కరించడానికి జేఎన్టీయూ అధికారులు జులైలోనే కాలేజీ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపినప్పటికీ, ఇంతవరకు ఎటువంటి స్పందన రాలేదు. వెంటనే ఈ అంశంలో తగిన అనుమతులు, ఆదేశాలు స్థానిక డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఇవ్వాలని కేటీఆర్ సూచించారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, ప్రభుత్వ అధికారులు ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. 2023లోనే మండేపల్లి గ్రామంలో 20 ఎకరాల స్థలం కేటాయించినందున, అక్కడ త్వరగా శాశ్వత భవనాల నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆయన కోరారు. ఈ సమస్యపై ప్రభుత్వ అధికారులు తక్షణమే దృష్టి సారించి విద్యార్థులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ అంశంలో వందలాది విద్యార్థుల సమస్యలపై వేగంగా స్పందించి ఉన్నతాధికారులతో మాట్లాడిన కేటీఆర్‌కు విద్యార్థులు, తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.

