రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల బరిలో భారత రాష్ట్ర సమితి ఘనవిజయం సాధించి, అన్ని పట్టణాలపై గులాబీ జెండా ఎగరవేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ పిలుపునిచ్చారు. మంగళవారం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మున్సిపల్ కోఆర్డినేటర్లు మరియు జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కేవలం రెండేళ్లలోనే ప్రజల్లో ఆ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన ద్రోహాన్ని, ఇచ్చిన హామీల అమలులో విఫలమై మోసం చేసిన తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూల వాతావరణం నెలకొందని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారనే ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న వారం రోజుల పాటు పార్టీ శ్రేణులంతా సమన్వయంతో కష్టపడితే భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం ముందు ప్రతిపక్షాలు నిలవలేకపోయాయని, అప్పట్లో కాంగ్రెస్, బీజేపీలు కేవలం ఏడెనిమిది స్థానాలకే పరిమితమైన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
ఎన్నికల వ్యూహంలో భాగంగా సమన్వయం కీలకమని కేటీఆర్ స్పష్టం చేశారు. చాలా చోట్ల పార్టీ విజ్ఞప్తిని మన్నించి తమ నామినేషన్లను ఉపసంహరించుకున్న రెబల్ అభ్యర్థులను సాదరంగా ఆహ్వానించాలని కోరారు. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి త్యాగం చేసిన ప్రతి నాయకుడి ఇంటికి అభ్యర్థులు స్వయంగా వెళ్లి, వారిని ప్రచారంలో భాగస్వాములను చేయాలని ఆదేశించారు. వారికి తగిన గౌరవం ఇచ్చి కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన బాధ్యత మున్సిపల్ సమన్వయకర్తలపై ఉందన్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో, క్షేత్రస్థాయి పరిస్థితులపై సమగ్ర నివేదికను వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని సూచించారు.
చివరి ఘట్టమైన ప్రచారంపై దృష్టి సారిస్తూ, ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షులు మరియు మాజీ మంత్రులు తమ పరిధిలోని మున్సిపాలిటీల్లో విజయావకాశాలను అంచనా వేసి, గెలుపు గుర్రాలను గట్టెక్కించేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. అభ్యర్థుల గెలుపుతో పాటు పోలింగ్ రోజున ఓటింగ్ శాతం పెంచడం పైన కూడా నాయకులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు మున్సిపల్ కోఆర్డినేటర్లు తమకు కేటాయించిన క్షేత్రాల్లోనే అందుబాటులో ఉండాలని సూచించారు.

