బ్యాలెట్ పద్దతిలోనే అన్ని ఎన్నికలను నిర్వహించాలని భారత ఎన్నికల కమీషన్ ను కోరామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు చెప్పారు. అభివృద్ది చెందిన ఎన్నో దేశాలు ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేసి తిరిగి పేపర్ బ్యాలెట్ తోనే ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతిని గుర్తుచేశామన్నారు. మరోవైపు కాళేశ్వరం నివేదికలో మొత్తం గ్యాస్, ట్రాష్ మాత్రమే తప్ప అందులో ఏమీ లేదని కేటీఆర్ మండిపడ్డారు. 650 పేజీల పూర్తి నివేదిక ఎవరూ చదవక ముందే అడ్డమైన రోత వార్తలను రెండు పత్రికలు రాస్తున్నాయని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ గారిపై, బీఆర్ఎస్ పై కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇక నవంబర్ లో జరిగే బీహార్ ఎన్నికలతోనే పేపర్ బ్యాలెట్ ను ప్రవేశపెట్టి, తరువాత జరిగే సాధారణ ఎన్నికలనూ బ్యాలెట్ తోనే నిర్వహించాలని స్పష్టం చేశామన్నారు. ఎన్నికల సంస్కరణలు, ప్రతిపాదనలు, ప్రవర్తనా నియమావళి సంబంధిత అంశాలపై చర్చించాలన్న భారత ఎన్నికల కమిషన్ ఆహ్వానం మేరకు వారితో సమావేశమయ్యామని కేటీఆర్ చెప్పారు. కారు గుర్తును పోలిన గుర్తులతో బీఆర్ఎస్ కు జరుగుతున్న నష్టాన్ని వివరించి తక్షణమే వాటిని తొలగించాలని కోరినట్టు తెలిపారు. ఇక బీహార్ లో జరుగుతున్న ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై ప్రజలకు వస్తున్న అనుమానాలు, కలుగుతున్న ఆందోళనలను తొలగించాలని కోరామన్నారు. కాళేశ్వరం కమీషన్ నివేదిక పై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందన్న కేటీఆర్, మైకులు కట్ చేయకుండా తమను అసెంబ్లీలో మాట్లాడనిస్తే ప్రభుత్వంతో ఫుట్ బాల్ ఆడుకుంటామన్నారు.
ఇవాళ మేము 6, 7 విషయాల మీద మా పార్టీ అభిప్రాయాన్ని ఎన్నికల కమీషన్ కు చెప్పాము…అమెరికా, యూకే, జర్మనీ, ఇటలీ తో పాటు ఇంకా చాలా దేశాలు ఈవీఎంలతో కొన్ని ప్రయోగాలు చేసి, ఆ తరువాత ప్రజలకు అనుమానాలు రావడంతో ఓటింగ్ మెషిన్లను వద్దనుకుని ఆయా దేశాలు తిరిగి పేపర్ బ్యాలెట్ కే వెళ్లాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశం. దాదాపు వంద కోట్ల ఓటర్లు మన దేశంలో ఉన్నారు.ఇలాంటి దేశంలో మిషన్ లతో నష్టం జరుగుతుందని, తమ ఓటు అనుకున్న వ్యక్తికి పోవడం లేదని ప్రజలకు అనుమానాలు వస్తే అది ప్రజాస్వామ్యానికి చేటు..అందుకే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను పక్కనపెట్టి తిరిగి పేపర్ బ్యాలెట్ తీసుకోవాలని మా పార్టీ తరపున ఎలక్షన్ కమిషన్ ను కోరాము. ఈ ఏడాది నవంబర్ లో జరిగే బీహార్ ఎన్నికల నుంచే తిరిగి పేపర్ బ్యాలెట్ ను ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశాము..ఆ తర్వాత వచ్చే పార్లమెంట్ సాధారణ ఎన్నికలను కచ్చితంగా పేపర్ బ్యాలెట్ తో నిర్వహించాలని మా పార్టీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాము అన్నారు.
ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే హామీలు,అడ్డగోలు వాగ్దానాలపై కూడా ఎన్నికల కమీషన్ తో చర్చించాము…తెలంగాణలో అధికారంలోకి రావాలనుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి 420 హామీలు ఇచ్చి , ఒక వేలంపాట లాగా నోటికొచ్చిన వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు సంపాదించి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎలా తప్పించుకుంటుందో ఎన్నికల సంఘానికి వివరించాము.అన్ని వాగ్దానాలను వంద రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి గ్యారెంటీ కార్డులు ముద్రించి, చివరికి స్టాంపు పేపర్ల మీద సంతకాలు పెట్టి, గుడిలో దేవుడి ముందు బాండు పేపర్లు పెట్టి ప్రజలను ఎలా వంచించారో చెప్పాము. రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోకి కట్టుబడి ఉండకపోతే వారిని శిక్షించే బాధ్యత, అధికారం ఎన్నికల కమిషన్ కు ఉంది.ఎన్నికల్లో ప్రజల్ని వంచించే ఏ పార్టీ అయినా మోసం చేస్తే వారి సభ్యత్వాన్ని రద్దు చేసి, ఎన్నికల్లో పాల్గొనడానికి వీలు లేకుండా అనర్హత వేటు వేయాలని ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేశాము అన్నారు.
ఈరోజు బీహార్ లో జరుగుతున్న ఓటర్ జాబితా సవరణ మీద వస్తున్న అనుమానాలు, దాదాపు 65 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని అక్కడి రాజకీయ పార్టీలు చేస్తున్న ఆందోళనపై ఎన్నికల కమిషన్ తో మాట్లాడాము…. చనిపోయిన వారి, వలస కార్మికులు, స్పందించని వారి ఓట్లను తీసేశామని కమీషన్ చెప్పింది. అన్ని రాజకీయ పార్టీలను విశ్వాసంలోకి తీసుకుని ఓటర్ జాబితా సవరణ చేయాలని మేము చెప్పాము. ముఖ్యంగా తాలూకా లెవెల్లో.. మండల్ లెవెల్లో…బూత్ లెవల్లో ప్రతిపక్షాలను భాగస్వామ్యం చేసి పారదర్శకంగా చేస్తే అన్ని పార్టీల మద్దతు ఉంటుందని తెలిపాము.అన్ని రాజకీయ పార్టీల బూత్ లెవెల్ కమిటీలతో ఒక అఖిలపక్షం ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయిలో ఉండే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ను, జిల్లా స్థాయిలో కలెక్టర్ ను, తాలూకా స్థాయిలో ఆర్డీవో ను, మండల స్థాయిలో ఎండిఓను, గ్రామస్థాయిలో వీఆర్వో ను కూడా ఈ ప్రక్రియలో భాగం చేయాలని సూచించాము. ఎవరి ఓట్లు తీస్తున్నారు? ఎందుకు తీస్తున్నారు? ఏ కారణంతో తీస్తున్నారన్న విషయాన్ని అన్ని పార్టీలకు చెప్పి పారదర్శకంగా తీసేయాలని ఎన్నికల కమీషన్ కు చెప్పాము. భారతదేశంలో ఇంకా ఎన్నికల సంస్కరణలు రావాలి. ఎన్నికల ఖర్చు విషయంలో, దొంగ హామీలు ఇచ్చి ప్రలోభ పెడుతున్న పార్టీల విషయంలో, ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయకుండా ప్రజలను వంచిస్తున్న పార్టీలు, నేతల విషయంలో కచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమీషన్ ను కోరాం అన్నారు.
చాలా విషయాలను రాతపూర్వకంగా మా పార్టీ నుంచి సమర్పించాము…మేము గత 20 ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యను ఇవాళ ఎన్నికల కమిషన్ తో విస్తృతంగా చర్చించాము. కారు గుర్తును పోలిన దాదాపు తొమ్మిది గుర్తులతో బీఆర్ఎస్ పార్టీకి జరుగుతున్న తీవ్ర నష్టాన్ని ఎన్నికల కమీషన్ కు సోదాహరణంగా వివరించాము.2019లో పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు స్థానంలో కారు గుర్తును పోలిన రోడ్ రోలర్ గుర్తు వల్ల అసలు ప్రచారమే చేయని ఇండిపెండెంట్ అభ్యర్థికి 27 వేల ఓట్లు వచ్చిన విషయాన్ని కమీషన్ కు చెప్పాం. ఆ ఎన్నికలో కేవలం 5 వేల ఓట్ల తేడాతో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇందుకు రోడ్ రోలర్ గుర్తు కారణమని గణాంకాలతో వివరించాము. ఇలా తమ పార్టీకి ఒకసారి కాదు ఎన్నో సందర్భాల్లో తీవ్ర నష్టం జరిగింది. మొన్నటి సాధారణ ఎన్నికల్లో కూడా 6000 కంటే తక్కువ ఓట్లతో 14 స్థానాల్లో ఓడిపోయాం. చపాతీ మేకర్, రోడ్ రోలర్, షిప్ లాంటి తొమ్మిది గుర్తులతో బీఆర్ఎస్ కు చాలా నష్టం జరుగుతుంది. వాటిని తక్షణమే తొలగించాలని ఎన్నికల కమిషన్ ను కోరాము. రెగ్యులర్ గా ఫీడ్ బ్యాక్ ను ఎప్పటికప్పుడు తమకు ఇవ్వాలని కమీషన్ కోరింది. ఎన్నికల కమిషన్ కూడా వివిధ రాష్ట్రాలు పర్యటించి ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో ఎన్జీవోలు, ప్రజాసంఘాలతో చర్చించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలి. దక్షిణాదిలో హైదరాబాదులో అందర్నీ పిలిచి మాట్లాడి అభిప్రాయాలు తీసుకోని సంస్కరణలు తీసుకురావాలని మా పార్టీ తరఫున వివరంగా చెప్పాను. వారు అన్ని సానుకూలంగా విన్నారు. మీరు మళ్ళీ మళ్ళీ రండి . ఏమన్నా సలహాలు ఫిర్యాదులు ఉంటే చెప్పండన్నారు.ఎన్నికల ప్రక్రియ,ఈవీఎంలపై భారతదేశ ప్రజల్లో ఉన్న అనుమానాలను కచ్చితంగా నివృత్తి చేయాలి. ఈవీఎంలను తొలగించాలి. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా చేయాలని మేము నొక్కి చెప్పాము అన్నారు.
మేం చెప్పిన కొన్ని సూచనలైనా.. ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందన్న విశ్వాసం ఉంది…బీహార్లో జరుగుతున్న ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలోని లోపాలను అరికట్టకపోతే, అడ్డుకోకపోతే రేపు ఇదే పరిస్థితి తెలంగాణలో కూడా వస్తుంది. ఇది దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజల సమస్య.
అర్హుడైన ఒక్య వ్యక్తికి కూడా ఓటు పోవద్దని కమీషన్ కు మేం స్పష్టం చేశాము. ఆ సూత్రాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశాము. అన్ని పార్టీలను విశ్వసం లోకి తీసుకొని మండల లెవెల్లో కమిటీ ఏర్పాటు చేసి సవరణలు చేస్తే అసలు ఈ విమర్శలే వచ్చేవి కావాని చెప్పాము. బీహార్ ప్రజల తరఫున, భారతదేశ ప్రజల తరఫున ఉన్న అనుమానాలను మేము ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువచ్చాము. వారు చిన్నచిన్న సవరణలు చేసుకుంటే దేశానికి మంచిది. ప్రజాస్వామ్యానికి మంచిది.బీసీలతో కాంగ్రెస్ పార్టీ క్రూరమైన పరిహాసం ఆడుతుందని శాసనసభలో బిల్లు పెట్టినప్పుడే మేము చెప్పాము. 42% రిజర్వేషన్లు అని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ డ్రామా చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ లో కేవలం రాజకీయ రిజర్వేషన్లు మాత్రమే లేవు. ఇంకా వేరే హామీలు కూడా ఉన్నాయి. వాటిని అమలుచేయకుండా ఆ పార్టీ నాటకాలు ఆడుతుంది.సంవత్సరానికి ₹20,000 కోట్ల బడ్జెట్ ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ ను బీసీలకు ఇస్తామన్నారు. బీసీ సబ్ ప్లాన్ పెడతామన్నారు. ఉద్యోగ, ఉపాధి, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు ..తమ చేతుల్లో ఉన్న ఈ పనులు చేయకుండా తమ చేతుల్లో లేని రాజకీయ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ నానా యాగీ చేస్తున్నది…అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండు బడ్జెట్ లు పెట్టిన కాంగ్రెస్, 20 వేల కోట్లు కూడా బీసీలకు కేటాయించలేదు. కనీసం పదివేల కోట్లు కూడా బీసీ సంక్షేమానికి ఖర్చు చేయలేదు…ఏ ఒక్క ప్రభుత్వ కాంట్రాక్టులోనైనా 42 శాతం రిజర్వేషన్ ను ఈ రెండు సంవత్సరాలలో కాంగ్రెస్ ఇచ్చిందా? .,ఎంబీసీ మంత్రిత్వ శాఖను పెడతామన్నారు ఎందుకు పెట్టలేదు? ,బీసీ సబ్ ప్లాన్ ఎందుకు పెట్టలేదు? … ఏ కారణంతోని విద్యా, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వడం లేదు…
రాజకీయాల్లో 42 శాతం వాటా వస్తే రాజకీయ నాయకులకే లాభం జరుగుతుంది. కానీ బీసీ జాతికి లాభం కావాలంటే, బీసీల్లో ఉండే పేదవారికి లాభం జరగాలంటే 42% కాంట్రాక్టులు ఇవ్వండి, 42 శాతం రిజర్వేషన్లు విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో ఇవ్వండి అన్నారు.
ప్రతీ బడ్జెట్ లో 20000 కోట్లు కేటాయించి ఖర్చు చేయండి. అప్పుడు మాత్రమే బీసీలు కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు…ఊహాజనిత శత్రువులను చూపించి తప్పించుకుంటే కుదరదు. కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న దొంగనాటకాన్ని తెలంగాణ ప్రజలు ముఖ్యంగా బీసీలు అర్థం చేసుకున్నారు. రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్తారు….655 పేజీల కమిషన్ నివేదికను 60 పేజీలకు కుదించడంలోనే కాంగ్రెస్ భాగోతం అర్థమైంది అన్నారు.
600 పేజీల్లో వారికి ఇష్టమైనవి లేవు. ఆ 60 పేజీల్లో మాత్రమే వారికి ఇష్టమైనవి ఉన్నాయి. అందుకే వాటిని మాత్రమే బయటపెడుతున్నారు…సాయంత్రం కమీషన్ రిపోర్ట్ వస్తే అర్ధరాత్రి ఆస్థాన మీడియాకు లీకలు ఇచ్చారు. తెల్లారి అబద్దాలను ప్రచారంలో పెట్టారు. రిపోర్ట్ ఎవరూ చదవకముందే ఆ రెండు పత్రికలు మాత్రం రోత వార్తలను రాసి కేసిఆర్ గారి మీద , బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేస్తున్నాయి.దమ్ముంటే మొత్తం 655 పేజీల నివేదికను ప్రజల ముందు పెట్టండి. ఇవాళ హరీశ్ రావు గారు కాళేశ్వరం మీద అన్ని వివరాలను సమగ్రంగా చెప్పారు. అసెంబ్లీలో మా మైకులు కట్ చేయకుండా మమ్మల్ని మాట్లాడిస్తే ఎవరు నిజం చెబుతున్నారు? ఎవరు అబద్ధం చెపుతున్నారో తెలిసిపోతుంది. కాంగ్రెస్ పార్టీకీ దమ్ముందా? ,కాళేశ్వరం, బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడి ఫుట్ బాల్ ఆడుతాము అన్నారు.
Also Read:KTR:పేపర్ బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు

