తెలంగాణలో నైపుణ్య శిక్షణ కార్యక్రమాల కోసం టాస్క్ ఏర్పాటుచేసి ఇప్పటికే చాలా మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు,యువకులను ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దే ఒక బహత్తర కార్యక్రమాన్నిచేపట్టామని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. ఇవాళ ముంబైలో మారిషస్ ప్రధానమంత్రి అనెరుధ్ జుగ్నాథ్ ను కలిసిన తారకరామారావు, పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య వారధిగా వ్యవహరిస్తూ టాస్క్ ఆధ్వర్యంలో చేపడుతున్న శిక్షణ కార్యక్రమాల వివరాలను మారిషస్ ప్రధానితో పంచుకున్నారు.
నైపుణ్య శిక్షణా రంగంలో మారిషస్ సాధించిన అద్భుతమైన ప్రగతి,అనుభవాలను తెలంగాణతో పంచుకోవాలని కోరారు. ఇందుకోసం అధికారికంగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్టు మంత్రి తెలిపారు. ఇన్నోవేషన్ రంగంలో దేశానికే రోల్ మోడల్ గా నిలిచిన టీ హబ్ మొన్ననే ఏడాది పూర్తి చేసుకుందని మారిషస్ ప్రధానమంత్రికి గుర్తుచేశారు. దేశంలో ఇన్నోవేషన్ ఎకో సిస్టాన్ని టీహబ్ బలోపేతం చేసిందని, విజయవంతమైన ఈ ప్రయోగాన్ని విస్తృత పరిచేందుకు టీ హబ్ 2 ను నిర్మిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు.
తెలంగాణ, మారిషస్ మధ్య అవగాహన ద్వారా ఇన్నోవేషన్ రంగంలో పరిశోధనలను మరింత ముందుకు తీసుకెళ్లచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇంతేకాదు తెలంగాణ నుంచి మారిషస్ కు టూరిస్టులు భారీగా వెళతారని, తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను మారిషస్ కు పరిచయం చేసేందుకు ఈ పరిణామాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నట్టు తెలిపారు.
పర్యాటక రంగంలో తెలంగాణ, మారిషస్ పరస్పరం సహకరించుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు. పలుసార్లు తెలంగాణను సందర్శించిన తమ దేశ ప్రతినిధి బృందాలు తెలంగాణ ప్రగతిని, ప్రభుత్వ విధానాల గురించి సానుకూలంగా మాట్లాడారని అనెరోద్ చెప్పారు. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన రెండేళ్లలోనే తెలంగాణ సాధించిన ప్రగతి అభినందనీయమన్నారు. విభిన్న రంగాల్లో అభివృద్ధి దిశగా దూసుకెళుతున్న తెలంగాణ లాంటి రాష్ట్రంతో పరస్పర అవగహనకు భాగస్వామ్యానికి మారిషస్ సిద్దంగా ఉందని మంత్రి కేటీఆర్ కు అనెరోద్ హామి ఇచ్చారు.