కాంగ్రెస్ బస్సుయాత్ర అట్టర్ ఫ్లాప్ షో అని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. మహబుబాద్ జిల్లాలో సమీకృతి జిల్లా భవనాలకు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడిన కేటీఆర్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మానుకోట వైఎస్ జగన్,చిరంజీవికి చుక్కలు చూపించిన గడ్డ అన్నారు. తెలంగాణ వస్తే చీకటిగా మారుతుందని పిల్లి శాపాలు పెట్టారని కానీ తెలంగాణ నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా రూ. 17 వేల కోట్లు రుణమాఫీ చేశారా అని ప్రశ్నించారు కేటీఆర్. సీఎం కేసీఆర్ సరికొత్త చరిత్రకు నాంది పలికారని తెలిపారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు బహురూపి వేషాలు వేస్తే ఎవరు నమ్మరని చెప్పారు. గతంలో ఎరువులు,విత్తనాల కోసం లైన్లలో,పోలీస్ స్టేషన్లకు క్యూ కట్టేపరిస్ధితి ఉండేదని కానీ నేడు సకాలంలో ఎరువులు,విత్తనాలు అందిస్తున్నామని చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడూ రైతులను పట్టించుకోలేదన్నారు.
నీళ్లు,నిధులు,నియమకాలను చేస్తూ ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. మహబూబాద్‌ను జిల్లా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. స్వరాష్ట్రంలో తెలంగాణ అన్నిరంగాల్లో ముందుకుపోతుందని బంగారు తెలంగాణ సాధించేవరకు విశ్రమించేది లేదన్నారు. అవసరమైతే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని సింగరేణి ఆధ్వర్యంలో నడుపుకుందామన్నారు కేటీఆర్.