అభివృద్దిలో ప్రజలను భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం మన నగరం అని మంత్రి కేటీఆర్ తెలిపారు. చందానగర్‌లో జలం జీవం కార్యక్రమాన్ని ప్రారంభించిన కేటీఆర్ భూగర్భ జలాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
లాతూర్‌లో మంచినీటి కొరత ఏర్పడితే రైళ్ల ద్వారా కేంద్రం నీటిని సరఫరా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. హైదరాబాద్ మహా నగరంలో ప్రతీ నిర్మాణానికి ఇంకుడు గుంతల నిర్మాణం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దీనికి అందరు సహకారం అందించాలన్నారు. 300 స్వ్కేర్ మీటర్ల అపార్ట్‌మెంట్‌లో తప్పనిసరిగా ఇంకుడు గుంతలు ఉండాలన్నారు.కానీ వందల సంఖ్యలో కూడా లేవన్నారు.
బిల్డర్‌లు కట్టించిన ఇళ్లకు వారే ఇంకుడు గుంతలు నిర్మించాలన్నారు. రాబోయే ఆరు నెలల్లో ప్రతీ ఇంటికి ఇంకుడు గుంత నిర్మాణం ఉండేలా..జలం జీవం అనే కార్యక్రమంతో ముందుకు పోదామన్నారు. విధిగా నగరవాసులు ఇంకుడు గుంతల నిర్మాణం కచ్చితంగా చేపట్టాలన్నారు.ఒకవేళ నిర్మించకపోతే… ఆ ఇంటి యజమాని, జీహెచ్ఎంసీ అధికారికి జరిమానా ఉంటుందని హెచ్చరించారు. అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో 42 శాతం మంది జనాభా పట్టణాల్లోనే ఉందని..హైదరాబాద్ జనాభా కోటి దాటిందని తెలిపారు. మన కాలనీలను సేఫ్ కాలనీలుగా మార్చుకోవాలని… అందరం కలిసి నడిస్తే సక్సెస్ సాధిస్తామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లో కొన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. మంచినీటి కొరత,విద్యుత్ కోతలు లేని నగరంగా హైదరాబాద్ ఉందన్నారు. నగరంలోని శివారు ప్రాంతాల్లో రూ.3వేల కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.నగరంలో 700 పైచిలుకు పార్క్‌లను కాలనీ సోసైటీలకు అప్పగించామని తెలిపారు.