తెలంగాణ రాజకీయాల్లో మరోసారి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహరించే తీరుపై సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పేర్లను ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
మరోవైపు భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, తెలంగాణ రాజకీయ పరిస్థితులపై కేటీఆర్ మాట్లాడారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఢిల్లీ నాయకులు తెలంగాణకు వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గజగజ వణికిపోతారని ఎద్దేవా చేశారు. ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు ఆమె భద్రతా సిబ్బంది రేవంత్ రెడ్డిని నెట్టివేసే పరిస్థితి ఉంటుందని వ్యాఖ్యానించారు. “వాడు చిన్నగా ఉన్నా కూడా మా ముఖ్యమంత్రి.. వాడిని నూకేయకండి” అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.
రాహుల్ గాంధీ పర్యటనను ప్రస్తావిస్తూ కూడా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ కుర్చీలో కూర్చుంటే రేవంత్ రెడ్డి టిష్యూలు తీస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇటీవల రాహుల్ గాంధీ హైదరాబాద్కు వచ్చినప్పుడు ఆయన వాహనం వెనుక మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వివేక్ వెంకటస్వామి పరుగులు తీశారని ఎద్దేవా చేశారు.
Also Read:సీతగా సాయి పల్లవి..OM దర్శకుడి కామెంట్స్!
కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాకుండా మరో ఢిల్లీ పార్టీకి కూడా ఇదే జబ్బు ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అమిత్ షా వచ్చినప్పుడు ఒక నాయకుడు ఆయన చెప్పులు ఎప్పుడు విప్పుతారా అని ఎదురుచూస్తుంటారని పరోక్షంగా విమర్శించారు. ఢిల్లీ నాయకుల ముందు రాష్ట్ర నాయకులు వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ విమర్శలు చేశారు.

