రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లకు ఖమ్మం ఆదర్శంగా నిలవాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించిన కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్ధాపన చేశారు. దక్షిణాబారతదేశంలోనే అధునాతన సౌకర్యాలతో రూ. 25 కోట్లతో నిర్మించనున్న ఖమ్మం బస్టాండ్‌కు శంకుస్ధాపన చేశారు. ఖమ్మం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని…అందుకే రూ. 356 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు.
ఖమ్మం జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించారని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. సౌత్‌లో ఎక్కడాలేని విధంగా అన్నిసౌకర్యాలతో బస్టాండ్ నిర్మాణం చేపట్టామని….కేవలం ఒక్క ఖమ్మంకే 100 ప్రత్యేక బస్సులు కేటాయించినట్లు వెల్లడించారు. అన్ని సౌకర్యాలు ఈ కాంప్లెక్స్‌లో అందుబాటులో ఉంటాయని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవన్నారు. కార్యక్రమంలో మంత్రులు, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్ కుమార్, జలగం వెంకట్రావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. రూ.25 కోట్లతో ఏడున్నర ఎకరాల్లో 35 ప్లాట్‌ఫాంలతో అధునాతన బస్టాండ్ నిర్మిస్తున్నారు. రోజుకు లక్ష మంది ప్రయాణికులు వినియోగించుకునేలా అత్యాధునిక ఏర్పాట్లు చేస్తున్నారు.
హైదరాబాద్ మహానగరం తరువాత రూరల్ ప్రాంతంలోని విద్యార్థులకు ఐటీ ఉద్యోగాలను అందించాలనే లక్ష్యంతో మొదటి సారిగా ఖమ్మంలో మంజూరుచేసిన ఐటీ హబ్‌కు శంకుస్థాపన చేశారు. అమెరికాకు చెందిన 7 కంపెనీలు, హైదరాబాద్‌కు చెందిన ఒక కంపెనీ శంకుస్థాపన రోజు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా వ్యాపార అనుమతి పత్రాలను అందుకున్నాయి.
అంతకముందు ఖమ్మం చేరుకున్న కేటీఆర్‌కు టీఆర్ఎస్ శ్రేణులు, మంత్రులు ఘనస్వాగతం పలికారు. గట్టయ్య సెంటర్‌కు చేరుకున్న మంత్రి డీసీసీబీ బ్యాంకు కార్యాలయాన్ని ప్రారంభించారు. భక్తరామదాసు కళాక్షేత్రానికి శంకుస్థాపన చేశారు.