వెంకట్ మృతి..సాహిత్య రంగానికి తీరని లోటు

11
- Advertisement -

ప్రముఖ రచయిత, తెలంగాణ వాది కొంపల్లి వెంకట్ గౌడ్ మృతి పట్ల సంతాపం తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వెంకట్ గౌడ్ ఇక లేరన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. వారి హఠాన్మరణం తెలంగాణ సాహిత్య రంగానికి, తెలంగాణ ప్రజలకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అన్నారు.

ప్రొఫెసర్ జయశంకర్ గారి జీవితాన్ని, అనుభవాలను “వొడువని ముచ్చట”గా తెలంగాణ ప్రజలకు అందించిన వెంకట్ గారు మరోవైపు ఆర్. విద్యాసాగర్ రావు గారి ఆలోచనలను “నీళ్ల ముచ్చట”గా పుస్తక రూపంలోకి తీసుకొచ్చి ఇద్దరు మహానుభావుల ఆలోచనలను శాశ్వతంగా పదిల పరిచారు. వీరితో పాటు ప్రముఖ సాహితీవేత్త నోముల సత్యనారాయణ వంటి ప్రముఖుల జీవితాలను కూడా గ్రంథస్తం చేశారు. తన జీవితకాలం ఆద్యంతం తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంపల్లి వెంకట్ గౌడ్ గారు పోషించిన పాత్ర అద్వితీయం అన్నారు.

అంతే కాకుండా, తన రచనల ద్వారా బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలుగా అభ్యున్నతి కలగాలన్నఆలోచన విధానంతో తన సాహిత్య జీవితాన్ని సాగించారు. గౌడన్నల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పి, సర్వాయి పాపన్న చరిత్రను అక్షరబద్ధం చేసి ఈ తరానికి అందించారు. తెలంగాణ తత్వం, ఉద్యమ స్ఫూర్తిని తన కలంలో నింపుకొని ఎన్నో రచనలు చేసిన ఆయన కృషి చిరస్మరణీయం…వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అన్నారు.

ప్రముఖ రచయిత కొంపెల్లి వెంకట్ గౌడ్ హఠాన్మరణం బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రొఫెసర్ జయశంకర్ మనో గతానికి ‘వొడువని ముచ్చట’ గా, ఆర్ విద్యాసాగర్ రావు గారి ఆలోచనలకు ‘నీళ్ల ముచ్చట’ గా పుస్తక రూపం ఇచ్చారు. ..గౌడన్నల ఆత్మగౌరవాన్ని తన రచనల ద్వారా చాటి, సర్వాయి పాపన్న చరిత్రను అక్షర బద్దం చేసి ప్రజలకు అందించారు. ..తెలంగాణ తత్వం, ఉద్యమ భావజాలాన్ని తన కలంలో నింపుకున్న కొంపెల్లి వెంకట్ గౌడ్ గారి మృతి తెలంగాణ సాహిత్య రంగానికి తీరని లోటు అన్నారు హరీష్‌.

Also Read:అగ్ని ప్రైమ్ క్షిపణి విజయవంతం

- Advertisement -