స్టేషన్ ఘన్ పూర్ టీఆర్ఎస్ అభ్యర్థి రాజయ్యను మార్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు మంత్రి కేటీఆర్. ఘన్‌పూర్ నియోజకవర్గ అసంతృప్త నేతలు,తాజా మాజీ ఎమ్మెల్యే రాజయ్య,డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. దాదాపు 4 గంటల పాటు సాగిన ఈ భేటీలో తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు కేటీఆర్.
ఒక అభ్యర్థిని మారిస్తే చాలా చోట్ల నుంచి ఒత్తిళ్లు వస్తాయని అలాంటి పరిస్థితులు తెవొద్దని చెప్పారు. కడియంకు వచ్చే ప్రభుత్వంలోనూ ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ఘన్‌పూర్ నియోజకవర్గంలో తాను ప్రచారం చేయనని కడియం ఈ సందర్భంగా చెప్పారు. కడియం మద్దతు దారులతో సయోధ్య కుదుర్చుకోవాలని రాజయ్యకు సూచించారు కేటీఆర్.
తాను ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించాలని, అందరికీ అనుకూలంగా ఉంటానని ఈ సందర్భంగా రాజయ్య చెప్పారు. తాను గెలిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని తెలిపారు.
తానే ఘన్‌పూర్ నియోజకవర్గానికి ఇంచార్జీగా ఉంటానని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ కోసం రాజయ్యను గెలిపించాలని 80 శాతం మంది ఓటర్లు టీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరుపై సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. కడియంకు అన్ని విధాలా న్యాయం చేస్తామని …కార్యకర్తలకు ఏవైనా సందేహాలు,సమస్యలు ఉంటే తనకు చెప్పాలన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కార్యకర్తలను కోరారు.