సాంకేతికత ఆధారంగా ఇటు పరిపాలన, అటు రాష్ట్రానికి పెట్టుబడుల కోసం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్న మంత్రి కేటీఆర్‌కు మరో విశిష్ట అవార్డు దక్కింది. ప్రభుత్వ రంగంలో అంతర్జాతీయంగా సాంకేతిక అక్షరాస్యత కోసం కృషిచేస్తున్న వారి గుర్తింపునకు సెర్టిపోర్ట్ అనే అమెరికా సంస్థ అధ్యయనంలో మంత్రి కేటీఆర్ గ్లోబల్ చాంపియన్ ఆఫ్ డిజిటల్ లిటరసీ అవార్డుకు ఎంపికయ్యారు. సెర్టిపోర్ట్ ఇంటర్నేషనల్ సేల్స్ ఉపాధ్యక్షుడు జాన్ డే ఆదివారం బేగంపేటలోని నివాసంలో మంత్రి ని కలిసి ఈ అవార్డును అందజేశారు.
డిజిటల్ లిటరసీకి సంబంధించి నిరంతరం శ్రమిస్తున్న వారిని ఎంపిక చేసే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో అనతికాలంలోనే అద్భుతమైన ఫలితాలు సాధించడంలో కేటీఆర్ కృతకృత్యులయ్యారని సర్టిఫోర్ట్ సంస్థ పేర్కొంది. సంస్థకు చెందిన అంతర్జాతీయ బృందం ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలలో అమూల్యమైన సేవలను అందిస్తూ స్ఫూర్తిదాయకంగా మారిన నేతలను గుర్తిస్తుంది.
హైదరాబాద్‌తో పాటు తెలంగాణకు టెక్నాలజీపరంగా విశేషమైన కృషి చేసినందుకే ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు తెలియజేశారు టి.హబ్‌తో వినూత్నతకు గుర్తింపు తెచ్చారని, తెలంగాణకు పెట్టుబడులు తేవడంలో విజయం సాధించారని, ప్రభావశీల నేతగా ఫలితాలు సాధించారని, తెలంగాణలో డిజిటల్ ఇండియా ప్రచారంలో ముందున్నారని జాన్‌డే చెప్పారు.
సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా అందిన దరఖాస్తులను పరిశీలిస్తుంది. క్షేత్రస్థాయిలోనూ పర్యటించే బృందాలు ఏటా ఒక్కరిని సంబంధిత రంగానికి గ్లోబల్ చాంపియన్ గా ఎంపిక చేస్తారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో అసామాన్యమైన ప్రతిభను కేటీఆర్ చాటారని, విద్యార్థులకు ఉపాధి అవకాశాలతో కూడిన సంస్థలను నెలకొల్పడం, సమర్థవంతమైన నాయకత్వలక్షణాలను ప్రదర్శించడం, ఉద్యోగావకాశాలను పెంపొందించడంలో భాగంగా మౌళిక వసతులకు పెద్ద పీట వేయడం వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్టు సర్టిపోర్ట్ ఇంటర్నేషనల్ సేల్స్ ఉపాధ్యక్షుడైన జాన్‌డే తెలిపారు.ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుకు ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ నైజీరియా మంత్రి బారిస్టర్ అబ్దుర్ రహీం ఎ.షిట్టుతో పాటు మెక్సికోలని అవిలా రాష్ట్ర గవర్నర్ కూడా ఎంపికయ్యారన్నారు.