మాజీ మంత్రి, భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు (కేటీఆర్)కు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. సుస్థిర పాలన, పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మకమైన ‘గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు 2025’కు ఆయన ఎంపికయ్యారు. ఈ నెల చివరిలో అమెరికాలోని న్యూయార్క్‌లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డు ప్రదానోత్సవం సెప్టెంబర్ 24న న్యూయార్క్‌లో జరగనున్న 9వ NYC గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్‌లో జరగనుంది. ఈ విషయాన్ని గ్రీన్ మెంటార్స్ సంస్థ అధికారికంగా కేటీఆర్‌కు తెలియజేసింది. “గ్రీన్ మెంటార్స్ తరపున, గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు 2025 గ్రహీతగా మీ ఎంపికను ధృవీకరించడం మాకు ఒక విశేషం” అని వారు తమ లేఖలో పేర్కొన్నారు.
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కేటీఆర్ తెలంగాణలో అనేక అద్భుతమైన పర్యావరణ కార్యక్రమాలను పర్యవేక్షించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో 977 పార్కులను అభివృద్ధి చేసి, 10 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో పాటు, 108 లంగ్ స్పేస్‌లు, థీమ్ పార్కులు, రెయిన్ గార్డెన్స్, ల్యాండ్‌స్కేప్ గార్డెన్స్, వర్టికల్ గార్డెన్‌లను ఏర్పాటు చేశారు. సంస్థాగత తోటలు, కాలనీ, వీధి తోటలు, మీడియన్, అవెన్యూ తోటల పెంపకానికి పెద్ద ఎత్తున కృషి చేసి, తెలంగాణ పచ్చదనాన్ని గణనీయంగా పెంచారు. ఈ కార్యక్రమాలతో హైదరాబాద్ పర్యావరణ పాలనలో ఒక ప్రపంచ ఆదర్శంగా నిలిచింది.
ఈ కృషి ఫలితంగా హైదరాబాద్‌కు ప్రతిష్టాత్మకమైన వరల్డ్ గ్రీన్ సిటీస్ అవార్డు లభించింది. అంతేకాకుండా, ఆర్బర్ డే ఫౌండేషన్ మరియు ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) చేత ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్’గా గుర్తింపు పొందిన ఏకైక భారతీయ నగరంగా నిలిచింది.మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో, కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణలో పల్లె, పట్టణ ప్రాంతాలలో మొత్తం పచ్చదనం 24% నుంచి 33%కి పెరిగింది. ఈ విజయాలు తెలంగాణను పర్యావరణ పరిరక్షణలో ముందంజలో ఉంచాయి.ఈ గౌరవంతో, కేటీఆర్ సుస్థిర, నివాసయోగ్యమైన నగరాలను సృష్టించడానికి కృషి చేసిన ప్రపంచ నాయకుల జాబితాలో చేరారు.
Also Read:మిరాయ్..ప్రీమియర్స్‌కి అద్భుత స్పందన!

