రాబోయే ఎన్నికలు ప్రభుత్వ పథకాలు, సీఎం కేసీఆర్ పనితీరుపై రెఫరెండంగా భావిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. ప్రతిపక్షాలు కూడా వారి పనితీరుకు రెఫరెండంగా భావించాలని సవాలు విసిరారు. శనివారం ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా ఉంటారని అన్నారు.
రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో బయటికి కనిపించేది కాంగ్రెస్ అయినా దానివెనుక ఉండి కాంగ్రెస్ తోలుబొమ్మను ఆడించేది మాత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబేనని మంత్రి కేటీఆర్ విమర్శించారు. చంద్రబాబు గతంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నించారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే కొనుగోలుచేసే ప్రయత్నాల్లో ఉన్నారని అన్నారు. చంద్రబాబువి శిఖండి రాజకీయాలుగా మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. ఓటుకు నోటు కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతున్నదని చెప్పారు.
ఎవరినైనా నమ్మితే, వారికి ప్రాణాలు ఇవ్వడం తెలంగాణ ప్రజల స్వభావమని, ఒకప్పుడు పేదలు ఇందిరాగాంధీని నమ్మారని, ఆ తరువాత ఎన్టీఆర్ ను నమ్మారని, ఇప్పుడు కేసీఆర్ను మాత్రమే నమ్ముతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ, రూ. 200 పింఛన్ ఇచ్చారని గుర్తుచేసిన ఆయన, తాము వచ్చి దాన్ని ఐదు రెట్లు పెంచామని, ఇప్పుడు కాంగ్రెసోళ్లు వచ్చి రూ. 2 వేలు ఇస్తామంటే ఎవరూ నమ్మడం లేదని అన్నారు.
ఎమ్మెల్యేలపై 100 శాతం సంతృప్తి అసాధ్యమని, ప్రతి ఒక్కరిపైనా ఎంతో కొంత అసంతృప్తి ఉంటుందని అభిప్రాయపడ్డ కేటీఆర్, సంక్షేమ పథకాలను అందిస్తున్నప్పటికీ, వ్యక్తిగత పనులు చేయలేదని తప్పుబట్టే వారు ప్రతి చోటా ఉంటారని ఆయన తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు జరిగేట్టుగా తెలంగాణలో ఎన్నికలు జరిగితే, కేసీఆర్ కు 80 శాతానికి పైగా ఓట్లు వస్తాయని అన్నారు.
1982 నుంచి బద్ధ శత్రువులుగా ఉన్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు జరిగే పని కాదని, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ నేతలు కలసి పనిచేసే అవకాశాలు లేవని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. 2009లో టీడీపీతో పొత్తును సైతం కేసీఆర్ వద్దంటే, తామే ఒత్తిడి చేసి ఒప్పించామని, కానీ, అది ఫలించలేదని గుర్తు చేశారు. ఒకరిపై ఒకరికి విశ్వాసం లేక, ఓట్ల బదిలీ జరగలేదని అన్నారు. కేవలం కేసీఆర్ను గద్దె దించాలన్న కుట్రతోనే కాంగ్రెస్ టీడీపీలు కలిశాయే తప్ప, మరే సిద్ధాంతమూ కాదని అన్నారు.