తన కారుకు చలాన్ వేసిన కానిస్టేబుల్‌ను అభినందించిన కేటీఆర్‌..

39

గాంధీ జయంతి రోజున తన వాహనానికి ట్రాఫిక్‌ చలాన్‌ వేసిన ఎస్‌ఐ ఐలయ్య, కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లను మంత్రి కేటీఆర్‌ సోమవారం అభినందించారు. రాంగ్ రూట్‌లో వస్తున్న కేటీఆర్ కారును ట్రాఫిక్ ఎస్ఐ ఐలయ్య అడ్డుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఆ వాహనానికి చలాన్ కూడా విధించారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ ఐలయ్యను కేటీఆర్ అభినందించారు. ఈరోజు ఐలయ్యను కేటీఆర్ తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. ఐలయ్య అంకితభావాన్ని ఈ సందర్భంగా ప్రశంసించారు. నిబంధనలు ప్రజలకైనా, ప్రజా ప్రతినిధులకైనా ఒక్కటేనని చెప్పారు. నిజయతీగా పని చేసే ఐలయ్య వంటి అధికారులకు తాము ఎప్పుడూ అండగానే ఉంటామని తెలిపారు.

చలాన్ విధించిన రోజున తాను కారులో లేనని చెప్పారు. అయితే, బాపుఘాట్‌లో నిర్వహించిన గాంధీ జయంతి కార్యక్రమం సందర్భంగా అనుకోని పరిస్థితుల్లో రాంగ్‌ రూట్‌లో వచ్చిందన్నారు. తన కారుకు విధించిన చలాన్‌ను కూడా చెల్లించినట్టు తెలిపారు. తన వాహనానికి నిబంధనల ప్రకారం చలాన్ విధించిన ఎస్ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లును మరోసారి అభినందిస్తున్నానని అన్నారు. వారికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి సత్కరించారు మంత్రి కేటీఆర్‌.