KTR:ఓటు వేసే ముందు ఆలోచించండి

7
- Advertisement -

ఓటు వేసే ముందు గుండె మీద చేయి వేసుకొని ఆలోచించి ఓటు వేయండి అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా యూస‌ఫ్‌గూడ‌లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు కేటీఆర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ..కేసీఆర్ అంద‌రినీ క‌డుపులో పెట్టుకొని చూసుకున్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ‌ను అభివృద్ధి చేసుకున్నాం అన్నారు.

బ‌స్తీ ద‌వాఖానా, 20 వేల లీట‌ర్ల ఉచిత నీళ్లు, క‌రెంటు క‌ష్టాలు లేకుండా చేసుకున్నాం… వెంగ‌ళ్‌రావు న‌గ‌ర్‌లో వెయ్యి ప‌డ‌క‌ల ఆస్ప‌త్రి నిర్మించుకున్నాం… హైద‌రాబాద్‌లో 42 ఫ్లై ఓవ‌ర్లు, కొత్త లింక్ రోడ్లు వేసుకున్నాం అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటికి స‌మ ప్రాధాన్య‌త ఇచ్చాం… ల‌క్ష‌లకొద్దీ ఐటీ ఉద్యోగాలు తెచ్చుకున్నాం… కొంచెం క‌ష్ట‌మైనా కుటుంబం బాగుండాల‌ని పేద‌లు ప్లాట్లు కొన్నారు. కానీ.. ఆ ప్లాట్ల ధ‌ర‌లు ఇప్పుడు ఎలా ఉన్నాయో అంద‌రూ ఆలోచించాలి అన్నారు.

మ‌నం పెట్టిన పెట్టుబ‌డులు హ‌ర‌తి క‌ర్పూరంలా క‌రిగిపోతున్నాయి… ఎన్ని అబ‌ద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిందో గుర్తు తెచ్చుకోవాలి… ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ అంద‌రినీ మోసం చేసింది… తులం బంగారం ఇస్తామ‌న్నారు.. ఎవ‌రికైనా ఇచ్చారా?, ఆడ‌బిడ్డ‌ల‌కు రూ.2500, వృద్ధుల‌కు రూ.4 వేలు పెన్ష‌న్ ఇస్తామ‌న్నారు.. ఇచ్చారా?, ఈ రెండేళ్ల‌లో ఒక్క మాట కూడా నిల‌బెట్టుకోని రేవంత్ రెడ్డి.. ఇప్పుడు జూబ్లీహిల్స్‌ని అభివృద్ధి చేస్తానంటే ఎవ‌రూ న‌మ్మ‌రు… ఇందిర‌మ్మ ఇల్లు ఇస్తామ‌ని చెప్పి ఇల్లు కూల‌గొడుతున్నారు. శ‌నివారం, ఆదివారం వ‌చ్చిందంటే పేద‌ల ఇళ్ల‌పైకి బుల్డోజ‌ర్ వ‌స్తోంది అన్నారు. రెండేళ్ల‌లో వేల ఇళ్ల‌ను నేల‌మ‌ట్టం చేశారు… ఇందిర‌మ్మ రాజ్యం పేరుతో ఇళ్లు కూల‌గొట్టే వాళ్ల‌కు ఎవ‌రైనా ఓటు వేస్తారా? అన్నారు.

క‌త్తి కాంగ్రెస్‌కు ఇచ్చి యుద్ధం మ‌మ్మ‌ల్ని చేయ‌మంటే ఎలా చేయాలి… క‌త్తి మాకు ఇవ్వండి బుల్డోజ‌ర్‌కు అడ్డంగా వెళ్లి ఆపే బాధ్య‌త మాది… బుల్డోజ‌ర్‌ను ఆపాలంటే కారు గుర్తుకు ఓటేయాలి… మాగంటి సునీత‌మ్మ‌ను గెలిపించుకుంటే.. మ‌ళ్లీ కేసీఆర్ వ‌స్తారు. 500 రోజుల్లో కేసీఆర్‌ను ముఖ్య‌మంత్రిని చేసుకుందాం.. జూబ్లీహిల్స్‌లో దిమ్మ‌తిరిగే షాక్ ఇస్తే.. రేవంత్ రెడ్డి మూడేళ్లు ఉంటడో.. మూడు నెల‌లు ఉంట‌డో తేలిపోతుంది… ఢిల్లీలో రేవంత్‌పై క‌త్తులు నూరుతున్నారంటా.. కొంద‌రు నేత‌లు సీఎం కుర్చీ కోసం రెడీ అవుతున్నారు… ఎన్నిక‌ల‌కు ముందు రేవంత్ రెడ్డి తీయ‌ని మాట‌లు చెప్తారు.. ఆ త‌ర్వాత పైస‌లు లేవ‌ని చేతులెత్తేస్తారు అన్నారు.

Also Read:చలికాలంలో బాడీ పెయిన్స్ కు చెక్ పెట్టండిలా!

- Advertisement -